మేము అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేకహోదా

September 16, 2022


img

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ గురువారం పట్నాలో ఓ ప్రకటన చేశారు. “దేశంలో ప్రతిపక్షాలనీ ఏకం అవుతున్నాయి. మేము అధికారంలోకి వస్తే దేశంలో వెనుకబడిన రాష్ట్రాలన్నిటికీ ప్రత్యేక హోదా ఇస్తాము. ఇదేం పెద్ద విషయం కాదు,” అన్నారు. 

ఆయన ఎన్డీయేలో చేరినప్పుడే బిహార్‌కు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేశారు. కానీ ఇవ్వకపోయినా బిజెపితో పొత్తు పెట్టుకొని ఇటీవల వరకు ప్రభుత్వం నడిపారు. బిజెపితో తెగ తెంపులు చేసుకొని బయటకు రాగానే మళ్ళీ ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్నారు.         

అంతేకాదు.. బిజెపితో తెగతెంపులు చేసుకొన్న తర్వాత దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలని ఏకం చేసేందుకు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారు. అంటే జాతీయ రాజకీయాలలో ఆయన కూడా చక్రం తిప్పాలని భావిస్తునట్లు స్పష్టమవుతోంది. తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని నితీశ్ కుమార్‌  చెపుతున్నారు. కానీ పార్టీ ముఖ్య నేతల చేత దేశానికి తన నాయకత్వం అవసరమని చెప్పిస్తున్నారు. నితీశ్ కుమార్‌ కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నందునే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ప్రకటించారని భావించవచ్చు. 


Related Post