కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు... ఓటు బ్యాంక్ రాజకీయాలేనా?

September 15, 2022


img

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ పరిపాలనా భవనానికి రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం తెలంగాణ ప్రజలందరికీ చాలా గర్వకారణం. మా ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం. అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్లనే తెలంగాణ ఏర్పడింది. అంబేడ్కర్ స్పూర్తితో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగేలా మానవీయ పరిపాలన చేస్తున్నాం. నూతన పార్లమెంట్ భవనానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని మేము శాసనసభల ఏకగ్రీవంగా తీర్మానం చేశాము. త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీకి లేఖ ద్వారా ఈ సూచన చేస్తాము,” అని అన్నారు. 

కొన్ని నెలల క్రితం సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పనికిరాదని, దానిని మార్చాలని అన్నారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి రాజ్యాంగమే కారణమన్నట్లు మాట్లాడారు. రాజ్యాంగం మార్చాలి ఏం తప్పా అంటూ నిలదీశారు. కానీ ఇప్పుడు అదే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్లనే తెలంగాణ ఏర్పడిందని సిఎం కేసీఆర్‌ మెచ్చుకొంటున్నారు. ప్రపంచ దేశాలలో అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచిన మమ రాజ్యాంగం పనికిరాదంటూ తప్పు పట్టడం ద్వారా దానిని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించినట్లే. కానీ ఇప్పుడు అదే అంబేడ్కర్‌ను దార్శనీకుడు, మహనీయుడని సిఎం కేసీఆర్‌ పొగుడుతున్నారు. సచివాలయానికి ఆయన పేరు పెట్టడం, నూతన పార్లమెంట్ భవనానికి కూడా ఆయన పేరు పెట్టమని కోరడం ఓటు బ్యాంక్ రాజకీయాలే. బడుగు బలహీనవర్గాల ఓటర్లను ఆకట్టుకోవాలని కేసీఆర్‌ ఆలోచన కనబడుతోంది. పనిలో పనిగా ఈ పేరుతో మోడీ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం రాజకీయం కాక మరేమిటి?        

రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో అందరికీ తెలుసు. కొంత కాలం క్రితం కురిసిన భారీ వర్షాలకు ములుగు, భద్రాచలం జిల్లాలలోని గ్రామాలలో బడుగు బలహీనవర్గాల ప్రజలు అల్లాడిపోతుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క అతి కష్టం మీద అక్కడకు చేరుకొని వారికి నిత్యావసర సరుకులు, తల దాచుకోవడానికి టార్పాలిన్లు పంచి పెట్టిన సంగతి తెలిసిందే. అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి చూపడం అంటే అదీ! భారీ అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం వలననో, ప్రభుత్వ కార్యాలయాలకు ఆయన పేరు పెట్టడం వలననో ఆయన ఆశయం నెరవేరదు. అవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలే అని చెప్పక తప్పదు.


Related Post