కూకట్‌పల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కనిపించిన చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను మాధవరం కృష్ణారావు వెంటనే ఖండించారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఈరోజు లబ్దిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “బండి సంజయ్ తన ఆరోపణలు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేస్తారా? చెరువుల కబ్జాలపై నేను ఎటువంటి విచారనాకైనా సిద్దమే. చెరువులు, భూముల కబ్జాలపై బిజెపి నేతలతోనే విచారణ కమిటీ వేసి విచారించమనండి. అప్పుడు బిజెపి నేతలు ఎన్ని కబ్జాలు చేశారో కూడా బయటపడుతుంది. కనుక బండి సంజయ్‌కి దమ్ముంటే నా సవాలుని స్వీకరించగలరా?” అని ప్రశ్నించారు.
టిఆర్ఎస్, బిజెపి నేతల మద్య ఇటువంటి సవాళ్ళు, ప్రతిసవాళ్ళు చాలానే జరిగాయి. కానీ ఇరు పార్టీల నేతలు చెరో ప్రదేశం నుంచి విమర్శలు, ఆరోపణలు చేసుకొని సవాళ్ళు విసురుకొంటారే తప్ప ఏనాడూ తమ నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకొనే ప్రయత్నం చేయరు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే వారి గుట్టే బయటపడుతుంది కనుక ఖమ్మంలో ఇరువురు టిఆర్ఎస్ నేతల బహిరంగ చర్చను అడ్డుకొన్నట్లే పోలీసులు అడ్డుకొంటారు. అక్కడితో ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ముగిసిపోతాయి. మళ్ళీ మరో అంశం తెరపైకి వస్తుంది. అప్పుడు వేరే నాయకులు సవాళ్ళు, ప్రతిసవాళ్ళు విసురుకొంటారు. ఇవి తమ రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. వీటితో ప్రజలకు కాలక్షేపమే తప్ప మరెటువంటి ఉపయోగమూ ఉండదు.