రాహుల్ భారత్‌ని జోడిస్తుంటే గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్!

September 14, 2022


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కారు... ఆ పదవి చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు కూడా. కానీ ఆయన తనను తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగానే   భావిస్తుంటారు. పార్టీ నేతలు కూడా ఆయనను మకుటం లేని మహారాజుగానే భావిస్తుంటారు. కనుక ఆ రాజు కానీ యువరాజు రాహుల్ గాంధీ దేశ ప్రజలను, రాష్ట్రాలను జోడిస్తానంటూ ‘భారత్ జోడో’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆయన దేశాన్ని జోడించేందుకు కాళ్ళరిగిపోయేలా పాదయాత్ర చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. 

గోవాలో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ నేతృత్వంలోనే వారందరూ బిజెపిలో చేరడం విశేషం. అంతే కాదు... కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి ఓ లేఖ కూడా అందజేశారు. దీంతో గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 3కి పడిపోయింది. మిగిలినవారు కూడా త్వరలోనే బిజెపిలో చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కనుక రాహుల్ గాంధీ భారత్‌ను జోడిస్తూ కశ్మీర్ వరకు చేరుకొనేలోగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాయం అయిపోతుందేమో?ముందు పార్టీని జోడించుకోకుండా దేశాన్ని ఎలా జోడిస్తారనే ప్రశ్న సర్వత్రా వినబడుతోంది. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవడం చూస్తే నిజమే అనుకోకతప్పదు.


Related Post