మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం అమలుచేయబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోలేకపోయింది. కానీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. కనుక మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ సెంటిమెంట్‌నే అస్త్రంగా వాడుకొనేందుకు సిద్దం అవుతోంది.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ జెండాతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన జెండాను రూపొందిస్తాము. ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాము. రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విదంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాము. టిఆర్ఎస్ ప్రభుత్వం తమ టిఆర్ఎస్ పార్టీని సూచించేవిదంగా రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబరులో ‘టిఎస్’ అని పెట్టించింది. మేము అధికారంలోకి వస్తే దానిని ‘టిజి’ గా మార్చుతాము. మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా తెలంగాణలో ఈ మార్పులకు ప్రజలు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
ఇంతవరకు టిఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని ప్రయోజనం పొందుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దానిని వాడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించబోతోంది. అయితే కాంగ్రెస్ పరిపాలనను చూసిన తెలంగాణ ప్రజలు మళ్ళీ సెంటిమెంట్ కోసం దానికి అవకాశం ఇస్తారా?అంటే అనుమానమే.
ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని విదాల సహాయసహకారాలు అందిస్తోంది. బిజెపిని, దాని వెనుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటోంది. కనుక మునుగోడు ఉపఎన్నికలలో ఆ రెండు పార్టీల మద్యనే పోరు సాగబోతోందని స్పష్టం అవుతోంది. కనుక రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాకపోవచ్చు.