సికింద్రాబాద్‌ అగ్నిప్రమాదం పాపం తలాపిడికెడు కాదా?

September 13, 2022


img

సికింద్రాబాద్‌లో రూబీ హోటల్‌ అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపిన అగ్నిమాపక శాఖ అధికారులు మూడు పేజీల నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. దానిలో ఏం పేర్కొన్నారంటే, హోటల్‌ దిగువన గల ఎలక్ట్రిక్ స్కూటర్లలో అమర్చిన లిథియం బ్యాటరీలు పేలిపోవడం వలననే ఈ అగ్నిప్రమాదం జరిగింది. మొదట సెల్లార్‌లో మంటలు చెలరేగి క్షణాలలో మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. పైన గల హోటల్‌లో ప్రవేశించడానికి ఒకే ఒక మెట్ల మార్గం ఉంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ మెట్ల మార్గంలో మంటలు, దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితులు బయటకు రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ మెట్లమార్గం గుండా పైకి వెళ్ళలేకపోయారు. దీంతో ప్రాణ నష్టం పెరిగింది. నిబందనల ప్రకారం మెట్ల పక్కనే లిఫ్ట్ ఏర్పాటు చేయకూడదు. కానీ భవన యజమాని ఆ నిబందనను పట్టించుకోలేదు. భవనంలో అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి కానీ ఏవీ పనిచేయడం లేదు. భవనంపై ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా లేదు. భవన, హోటల్‌ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్నిప్రమాదం, ప్రాణ నష్టం జరిగింది.

భవన, హోటల్‌ యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ అగ్నిప్రమాదం, ప్రాణ నష్టం జరిగిందనేది వాస్తవం. అయితే భవనం కడుతున్నప్పుడు టౌన్ ప్లానింగ్ ఎలా అనుమతి మంజూరు చేసింది?ఈ భవనంలో అగ్నిప్రమాదం జరిగి, ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇన్ని లోపాలను ఎత్తి చూపిన అగ్నిమాపకశాఖ మరి ఇన్నేళ్ళుగా ఏమి చేస్తోంది? ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఇటువంటి ఇరుకైన మెట్ల మార్గాలు, అగ్నిప్రమాదం జరిగితే తప్పించుకొని బయటపడే అవకాశం లేని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కూడా అగ్నిప్రమాదం జరిగి, ప్రాణాలు కోల్పోయకనే అగ్నిమాపక శాఖ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకొంటుందా?ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి ఉన్నప్పుడు రవాణా సంబందిత శాఖలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి.

కనుక ఈ అగ్నిప్రమాదానికి హోటల్‌ యజమానిది ఎంత తప్పు, బాధ్యత ఉందో సంబందిత శాఖలకీ అంతే తప్పు, బాధ్యత ఉందని చెప్పక తప్పదు. కనుక ఇకనైనా ప్రభుత్వం తగిన చర్యలు, విధివిధానాలు రూపొందించి అమలుచేస్తే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు.


Related Post