వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కి ఫిర్యాదు!

September 13, 2022


img

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తొలిసారిగా టిఆర్ఎస్‌ దృష్టి సారించింది. ఆమె తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో నిత్యం సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ టిఆర్ఎస్‌ వాటిని ఏనాడూ పట్టించుకోలేదు. ఇటీవల ఆమెకీ మంత్రి నిరంజన్ రెడ్డికి మద్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగాయి. ఆమె ఆరోపణలపై ఎట్టకేలకు టిఆర్ఎస్‌ ప్రతిచర్యలకు సిద్దమైంది. 

టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమె సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిష్టకు భంగం కలిగించేవిదంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. కనుక ఆమెపై చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ స్పీకర్‌  పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. 

ఆయన వెంటనే స్పందిస్తూ ఆ లేఖను సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపించారు. కమిటీ బుదవారం సమావేశమై     దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మొదటి తప్పుగా ఆమెను కమిటీ ముందుకు పిలిపించి మందలించి పంపించే అవకాశం ఉంది. కానీ ఆమెను కమిటీ ముందు హాజరవ్వాలని నోటీస్ పంపితే ఏవిదంగా స్పందిస్తారో, తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో త్వరలోనే తెలుస్తుంది.


Related Post