మునుగోడు ఉపఎన్నికల గంట మ్రోగకముందే కాంగ్రెస్, బిజెపిలు తమ అభ్యర్ధులను ప్రకటించేశాయి. వారు అప్పుడే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కానీ సిఎం కేసీఆర్ మాత్రం ఇంతవరకు టిఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికలలో ఎప్పుడూ ముందుండే కేసీఆర్ ఈసారి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని టిఆర్ఎస్‌లో కూడా చర్చించుకొంటున్నారు.
ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే కేసీఆర్ అభ్యర్ధిని ప్రకటిస్తారని టిఆర్ఎస్ చెపుతున్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే, కాంగ్రెస్, బిజెపిల అభ్యర్ధులు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసుకొంటుంటే, ఎన్నికల షెడ్యూల్ వెలువడేవరకు ఆగాల్సిన అవసరమేమిటి? దాని వలన నష్టమే తప్ప లాభం ఉండదు.
కనుక కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళే ఆలోచిస్తూ మునుగోడు అభ్యర్ధిని ఖరారు చేయడంలేదేమో? అందుకే కాంగ్రెస్, బిజెపిలు మునుగోడు ఉపఎన్నికల ప్రచారం చేసుకొంటున్నా పట్టించుకోవడం లేదేమో?అనే సందేహం కలుగుతోంది.
ఈ ఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. కనుక వాటితో పాటు ఈ ఉపఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. కనుక ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు సిఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలనుకొంటున్నారేమో?
తద్వారా అప్పటివరకూ కాంగ్రెస్, బిజెపిలను మునుగోడు ఉపఎన్నికల మాయలో మునిగితేలుతూ ఉండేలా చేస్తూ, మరోపక్క నిశబ్దంగా శాసనసభ ముందస్తు ఎన్నికలకు టిఆర్ఎస్ అన్ని ఏర్పాట్లుచేసుకొని సిద్దం కావచ్చు. ఒకవేళ కేసీఆర్ హటాత్తుగా ముందస్తు ఎన్నికలకి వెళ్ళినట్లయితే, కాంగ్రెస్, బిజెపి టికెట్ల పంపకాలు, సీట్ల సర్దుబాట్లలో తలమునకలైపోతాయి. అప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేయవచ్చు. కేసీఆర్ ఎలాగూ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు. కనుక ముందస్తు ఎన్నికలలో టిఆర్ఎస్‌ను మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించుకొని మరోసారి తన సత్తా చాటుకొన్న తర్వాత కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి ఢిల్లీకి బయలుదేరాలనుకొంటున్నారేమో? ఈ ఊహాగానాలు నిజమవుతాయా కావా అనేది మరికొన్ని రోజులలో తేలిపోతుంది.