మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ కౌంట్ డౌన్‌... మరో 145 రోజులే!

September 12, 2022


img

ఇప్పుడు దేశంలో అధికార పార్టీలకి ప్రతిపక్షాలు కౌంట్ డౌన్‌ బోర్డులు పెట్టే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ సర్కారుకి బిజెపి కౌంట్ డౌన్‌ బోర్డు పెట్టగా, మోడీ సర్కారుకి టిఆర్ఎస్‌ కౌంట్ డౌన్‌ బోర్డు పెట్టింది. ఇప్పుడు ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. రాహుల్ గాంధీ భారత్‌ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆయన పాదయాత్ర విశేషాలను తెలియజేస్తోంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఓ పోస్టర్‌ పెట్టింది. దానిలో పైన భారత్‌ జోడో అని వ్రాసి ఉండగా కిందన మంట అంటుకొన్న ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్కరు బొమ్మను పెట్టింది. దాని కింద (మోడీ సర్కారుకి) ఇంకా 145 రోజులు మాత్రమే మిగిలి ఉందని వ్రాసింది.

అంటే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్రతో దేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం కాలిబూడిదవుతుందని, ఆర్ఎస్ఎస్ మద్దతుతో అధికారం చలాయిస్తున్న మోడీ సర్కార్ 145 రోజుల తర్వాత గద్దె దిగకతప్పదని సూచిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం పట్ల వివిద వర్గాల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం. దేశంలో ప్రతిపక్షాలన్నీ మెల్లగా ఒకే పార్టీ లేదా కూటమిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఎదురీత తప్పకపోవచ్చు.

కానీ కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య, కాంగ్రెస్‌ని కలుపుకోకుండా ప్రతిపక్షాలు మోడీని ఎదుర్కొలేని పరిస్థితులు, ప్రతిపక్షాల మద్య మళ్ళీ ప్రధాని పదవికి పోటీదారులు ఉండటం వంటి పలు కారణాలే బిజెపి గెలుపుకు దోహదపడవచ్చు.

కనుక రాహుల్ గాంధీ భారత్‌ జోడో అంటూ పాదయాత్ర చేసినా కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా సీట్లు గెలుచుకొని కేంద్రంలోకి అధికారంలోకి రాలేదు కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మరికొంత బలం పెరగవచ్చు లేదా రాహుల్ గాంధీకి కాళ్ళ నొప్పులే మిగలవచ్చు. 

   


Related Post