టిఆర్ఎస్‌లో మునుగోడు టికెట్ పంచాయతీ తేలేదెప్పుడు?

September 10, 2022


img

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వగానే క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదించిన టిఆర్ఎస్‌, ఇంతవరకు అభ్యర్ధిని ఖరారు చేయడానికి వెనకాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ఉపఎన్నికలలో గెలవడం టిఆర్ఎస్‌కు చాలా ముఖ్యం కనుక బలమైన గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయడం కోసమే ఆలస్యం జరుగుతోంది. 

మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బరిలో నిలిపినందున, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేదా మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డిలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకొంటున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై సర్వే జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో ఎవరికి అనుకూలంగా వస్తే వారికే మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. బహుశః రెండు మూడు రోజులలో వీరిలో ఒకరిని అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది. 

కాంగ్రెస్‌, బిజెపిల అభ్యర్ధులు పాల్వాయి స్రవంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వారి తరపున వారి పార్టీలు కూడా ఇప్పటికే మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. టిఆర్ఎస్‌ అభ్యర్ధి కూడా ఖరారైతే అప్పుడు మూడు పార్టీల మద్య హోరాహోరీగా యుద్ధం ప్రారంభం అవుతుంది.


Related Post