కాంగ్రెస్ విషయంలో కేసీఆర్‌ వైఖరి మారుతుందా?

September 10, 2022


img

బిజెపి, కాంగ్రెస్ పార్టీల వలననే దేశం అభివృద్ధి చెందలేదని గట్టిగా నమ్ముతున్న సిఎం కేసీఆర్‌ వాటికి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. కానీ దేశంలో బిజెపికి దూరంగా ఉన్న ప్రాంతీయపార్టీలలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో బలమైన సంబందాలు కలిగి ఉన్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా కూటమి ఏర్పాటుకి అవి ముందుకు రాకపోవడంతో సిఎం కేసీఆర్‌ సొంతంగా జాతీయపార్టీ ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. 

కానీ దానికైనా కాంగ్రెస్‌తో ఏవిదంగా వ్యవహరించాలనే ప్రశ్న తప్పక ఎదురవుతుంది. అప్పుడే కేసీఆర్‌ స్థాపించబోయే జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలో వద్దో దేశంలోని ప్రాంతీయపార్టీలు నిర్ణయించుకొంటాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ రాజకీయ శత్రువు గనుక జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ను దూరంగా ఉంచకతప్పదని కేసీఆర్‌ భావిస్తుండవచ్చు. కానీ కేసీఆర్‌ లక్ష్యమైన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ సహకారం చాలా అవసరం. కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉంటూ, శాసనసభ ఎన్నికలు ముగిసి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దపడవచ్చు. 

ఇదివరకు కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినందున ఆ లెక్కన ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికలకంటే ముందే శాసనసభ ఎన్నికలు పూర్తవుతాయి. కనుక అప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. బహుశః అందుకే కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌లో అందరూ రాష్ట్ర కాంగ్రెస్‌ పట్ల కాస్త మెతకవైఖరి అవలంభిస్తున్నారనుకోవచ్చు.


Related Post