సిఎం కేసీఆర్ అక్టోబర్ 5వ తేదీన జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారు. అదే రోజున పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. తెలంగాణలో 33 జిల్లాల టిఆర్ఎస్ అధ్యక్షులు శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ని కలిసి తక్షణం జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీ అప్రజాస్వామిక, రైతు, ప్రజా వ్యతిరేక పాలనతో వేసారిపోయున్న దేశ ప్రజలు ప్రధానిగా మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని నిర్ణయించుకొని, అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసుకొన్నారు కనుక పార్టీ నేతల అభ్యర్ధనకు ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
సిఎం కేసీఆర్ కేవలం 8 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఏవిదంగా అభివృద్ధి చేసి చూపారో, ప్రధానమంత్రి అయితే దేశాన్ని కూడా 5 ఏళ్ళలో అదేవిదంగా అభివృద్ధి చేసి చూపుతారని మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం ఖాయం అయిపోయింది కనుక తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారా? లేక మరికొంతకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రంలో బిజెపి దూకుడికి పూర్తిగా అడ్డుకట్టవేసిన తర్వాత కేటీఆర్‌కు తెలంగాణ పగ్గాలు అప్పజెపుతారా? అనేది మున్ముందు తెలుస్తుంది.