జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మద్య జరుగుతున్న వర్గపోరు రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మళ్ళీ సిట్టింగులకే టికెట్స్ ఇస్తానని ప్రకటించడంతో తాటికొండ రాజయ్య ఇంకా ఉత్సాహంగా ఉన్నారు.
ఆయన స్టేషన్ ఘన్‌పూర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “ఈ నియోజకవర్గంలో కొందరు సర్పంచ్‌లు కడియం శ్రీహరి పంచన చేరుతున్నారు. మంచిదే కానీ వారు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. వారి గ్రామాలలో ఏ పనులు జరగాలన్నా వారు నా దగ్గరకే రావలసి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ మాత్రమే. మేమిద్దరం నియోజకవర్గానికి రెండు కళ్ళవంటివాళ్ళం. ఒక కన్నును వద్దనుకొంటే మిగిలిన ఒక కంటితో చూడటం సాధ్యపడదని సర్పంచ్‌లు గ్రహిస్తే మంచిది,” అని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేయాలని కడియం శ్రీహరి భావిస్తున్నారు. కానీ ఆ టికెట్ మళ్ళీ రాజయ్యాకే ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ ప్రకటనతో స్పష్టమైంది. రాజయ్యకు టికెట్ ఖరారని తెలిసి ఉన్నా ఆయనతో గొడవపడుతూ కాలక్షేపం చేస్తే మొదటికే మోసం అవుతుంది. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నందుకు వేటు పడే ప్రమాదం ఉంటుందని కడియం శ్రీహరికి తెలియదనుకోలేము. కనుక ఇప్పుడు ఏం చేయాలో కడియం శ్రీహరి ఆలోచించుకొంటే మంచిదేమో?