బ్రిక్స్ తీర్మానం బాగానే ఉంది కానీ..

October 17, 2016


img

గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల రెండు రోజుల సదస్సులో ఊహించినట్లుగానే ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం ఆమోదించి దానిని అధికారికంగా ప్రకటించేశారు. ఆ ప్రకటన చేయించడంలో మోడీ విజయం సాధించినప్పటికీ దాని వలన భారత్ కి ఒరిగేదేమీ ఉండదని అందరికీ తెలుసు.

గతంలో కూడా అటువంటి తీర్మానాలు, ప్రకటనలు చాలానే చేశారు. అంతమాత్రన్న చైనా పాకిస్తాన్ కి అండగా నిలబడటం మానివేయలేదు. భారత్ పై అనేక దాడులకి పాల్పడి పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్న హిజ్బుల్ ఉగ్రవాది మసూద్ అజహర్ ని ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించాలనుకొన్నప్పుడు చైనా అడ్డుపడటం మానుకోలేదని అందరికీ తెలుసు. ఇక యూరి ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడులు జరిగిన వారం రోజులలోపే బ్రిక్స్ సభ్యదేశమైన రష్యా పాకిస్తాన్ ఆర్మీతో కలిసి సైనిక శిక్షణలో పాల్గొంది. 

ఆ రెండు దేశాలు పాకిస్తాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరికి, బ్రిక్స్ సదస్సులో చేసిన తీర్మానానికి ఎక్కడా పొంతన లేదు. ఈ 102 పేరాలతో కూడిన గోవా ప్రకటన ప్రకటన చేయించినందుకు మోడీ ప్రభుత్వం గొప్పగా భుజాలు చరుచుకోవచ్చు కానీ అది కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో కనబడదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా మాటలని అసలు నమ్మలేము. ఈ బ్రిక్స్ ప్రకటన వలన పాకిస్తాన్ ఆగ్రహం చెందుతుంది కనుక దానిని కూల్ చేసేందుకు నేడో రేపో పాకిస్తాన్ కి అనుకూలంగా చైనా ఏదో ప్రకటనో లేదా ఎహో భారీ సహాయమో చేయవచ్చు. బ్రిక్స్ గోవా ప్రకటనలో పాకిస్తానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఎక్కడా పాకిస్తాన్ పేరు పేర్కొనకపోవడమే దానిలో డొల్లతనం బయటపెడుతోంది.   

ఈ సదస్సు ద్వారా భారత్ సాధించింది ఏమిటంటే చైనా, రష్యాలతో అనేక ఒప్పందాలు చేసుకోవడమే. వాటి వలన భారత్ కి చాలా మేలు కలుగవచ్చు కానీ భారత్ కంటే ఆ రెండు దేశాలకే ఎక్కువ లాభం కలుగుతుంది. ముఖ్యంగా రష్యాతో చేసుకొన్న రక్షణ ఒప్పందాల ద్వారానే ఆ దేశానికి రూ.36,000 కోట్లు బిజినెస్ ఇచ్చాము. కానీ భారత్ మార్కేట్లని ముంచెత్తుతున్న చైనా వస్తువులకి మోడీ ప్రభుత్వం అడ్డు కట్టవేసే సాహసం చేయలేకపోయింది. పైగా దానితో కూడా మళ్ళీ అనేక వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకొని దానికీ మంచి బిజినెస్ అప్పగించింది. కనుక ఈ బ్రిక్స్ సదస్సు ద్వారా చైనా, రష్యాలని పాకిస్తాన్ కి దూరం చేయాలనే భారత్ ఆశించిన ప్రయోజనం నేరవేరనట్లే భావించవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం ఆ దిశలో వేస్తున్న అడుగులు మెల్లగా ఎప్పటికో ఫలితం చూపించవచ్చు. 


Related Post