తెలంగాణ శాసనసభ ఎన్నికలకి ఇంకా 21 నెలలు సమయం ఉంది. కానీ అధికార టిఆర్ఎస్ కేంద్రం, బిజెపిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి గట్టిగా ప్రచారం చేసుకొంటూ ఎన్నికలకి సిద్దమవుతోంది. ఇటీవల ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటన చేసి సిఎం కేసీఆర్‌తో 8 గంటల సేపు సుదీర్ఘంగా భేటీ అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఇప్పటి నుంచే పాదయాత్రలు మొదలుపెట్టేశాయి. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించగా, బీఎస్‌పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ఆదివారం జనగామజిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టేరు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 12 నుంచి తన ప్రజా సంగ్రామయాత్రను పునః ప్రారంభించబోతున్నారు. వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల కూడా ఈ నెల 11న నల్లగొండ జిల్లా నుంచి తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను పునః ప్రారంభించబోతున్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ 95-105 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని సిఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. అయితే వచ్చే ఎన్నికలలో బిజెపియే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని బండి సంజయ్ జోస్యం చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటుంటారు. వచ్చే ఎన్నికలలో గెలిచి ఏనుగుపై ప్రగతి భవన్‌లోకి ప్రవేశించి బహుజనుల రాజ్యం స్థాపించబోతున్నామని ప్రవీణ్ కుమార్ జోస్యం చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తాం కావాలంటే రాసి పెట్టుకోండని వైఎస్ షర్మిల చెపుతున్నారు.
అయితే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఏ పార్టీ మిగిలిన వాటిపై రాజకీయంగా పైచేయి సాధిస్తుందనే దానిపై ఫలితాలు ఉంటాయి. బహుశః అందుకే ప్రతిపక్షాలు పాదయాత్రలు మొదలుపెట్టి ఉండవచ్చు.