ఒకవేళ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఉండి ఉంటే, రష్యాతో ఏవిదంగా వ్యవహరించి ఉండేవారో?అని చాలామందికి సందేహం వస్తోంది. దానికి ఆయన సమాధానం చెప్పలేదు కానీ రష్యా-ఉక్రెయిన్ పరిణామాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బుదవారం ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఉక్రెయిన్ తరువాత తైవాన్ వంతు రానుంది. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా ఏవిదంగా ఆక్రమించుకొందో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఆయన చాలా తెలివైనవారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికాకు ఎదురైన చేదు అనుభవాలు, గత ఏడాది అక్కడి నుంచి అమెరికా దళాలు వెనుతిరిగిరావడం వంటి అన్ని పరిణామాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఇంతకాలం తైవాన్‌ను ఆక్రమించుకొనే విషయంలో ఆయన ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన అడుగు ముందుకు వేయడానికి సరైన మార్గం కనబడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్నప్పటికీ మన చేతకాని అసమర్ధ పాలకులు ఏమీ చేయలేకపోవడంతో రేపు చైనా కూడా ఇదేవిదంగా తైవాన్‌ను ఆక్రమించుకొన్నా అడ్డుకోనేవారు ఎవరూ ఉండరని స్పష్టమైంది. కనుక త్వరలోనే ఆయన తైవాన్‌ను ఆక్రమించుకోవడం ఖాయం,” అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఒక బలమైన దేశం పొరుగునే ఉన్న మరో చిన్న దేశంపై బాంబుల వర్షం కురిపిస్తూ అక్కడి ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రపంచదేశాలు ఏమీ చేయలేక నిసహాయం చూస్తూ ఉండిపోయాయి. బహుశః అణుబాంబు భయాల వల్ల కావచ్చు లేదా యుద్ధం తమ దేశాలకు కూడా విస్తరించకూడదనే ఆలోచన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ రష్యాను ఎవరూ అడ్డుకోలేరని తేలిపోయింది కనుక డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు రేపు చైనా కూడా తైవాన్‌ను ఆక్రమించవచ్చు.
చైనా కన్ను మన అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా ఉండి. కానీ భారత్ కూడా శక్తివంతమైన దేశం కనుక అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకొనే దుస్సాహాసం చేయకపోవచ్చు. అందుకే కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు వంతపాడుతోందని భావించవచ్చు.