ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నిన్న అత్యవసర సమావేశం నిర్వహించి ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ ఓటింగ్ చేపట్టగా దానిలో పాల్గొన్న 15 దేశాలలో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్, చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారి టిఎస్ తిరుమూర్తి సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి చేసే యుద్ధాలతో ఎటువంటి పరిష్కారం లభించదని భారత్ భావిస్తోంది. కనుక తక్షణమే యుద్ధం నిలిపివేసేందుకు సభ్యదేశాలు గట్టిగా ప్రయత్నించాలని భారత్ కోరుతోంది,” అని అన్నారు.
భద్రతామండలిలో ఐదు శాస్విత సభ్య దేశాలలో ఒకటైన రష్యా తనకున్న ‘విటో పవర్’ ఉపయోగించి ఈ తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది.
రష్యాతో భారత్‌కున్న సంబంధాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొనే భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదని అర్దమవుతూనే ఉంది. కానీ రష్యా చేస్తున్న పని తప్పు అని భారత్ గట్టిగా నమ్ముతున్నప్పుడు అదే విషయం ఓటింగ్ ద్వారా తెలియజేస్తే బాగుండేది. ఒకవేళ అంత మాత్రం చేత భారత్-రష్యా సంబంధాలు దెబ్బ తినే మాటయితే బలహీనమైన అటువంటి సంబంధాన్ని నిలుపుకోవడం కోసం భారత్ ఆరాటపడటం కూడా అనవసరం. పాక్ పట్ల నిర్ద్వందంగా వ్యవహరిస్తున్న భారత్, రష్యా పట్ల మెతక, తటస్థ వైఖరి అవలంభిస్తుండటం రష్యాకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లే భావించవచ్చు. యుద్ధం వద్దని కోరుకొంటున్నప్పుడు అదే విషయం గట్టిగా చెప్పగలిగే ధైర్యం కూడా అవసరం లేకుంటే ఇటువంటి మాటలకు అర్ధం ఉండదు.