ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం హటాత్తుగా ఆ పదవి నుంచి తప్పించింది. ఆయనకు వెంటనే ఏ పోస్ట్ ఇవ్వలేదు కానీ ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డిజిపిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ పేరుతో వేటు వేసిందని ప్రతిపక్షాలు విమర్శించసాగాయి.
ఇటీవల వేతన సవరణపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించి, ఎక్కడిక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులను అరెస్ట్ చేసారు. అయినా లక్షల సంఖ్యలో విజయవాడకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగ సంఘాల నేతలతో మళ్ళీ వేతనసవరణలపి చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు రాకుండా అడ్డుకోవడంలో గౌతమ్ సవాంగ్ విఫలమైనందునే ప్రభుత్వం ఆయనను డిజిపి పదవి నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉదయం ఆయనను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రతిపాదిస్తూ సిఫార్సు లేఖను ఏపీ గవర్నర్ బిశ్వాభూషణ్ హరిచందన్‌కు పంపించింది. గవర్నర్ ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే కనుక ఆయనకు ఆ పదవి లభించినట్లే భావించవచ్చు.
అయితే హటాత్తుగా డిజిపి పదవిలో నుంచి తప్పించి రెండు రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి ఇప్పుడు విమర్శలు మొదలయ్యాక ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించడం గమనిస్తే ఆయన పట్ల ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సంతృప్తిగా లేరనిపిస్తుంది.