కాంగ్రెస్‌ శ్రేణులూ...అయోమయానికి గురికావద్దు: రేవంత్‌

February 15, 2022


img

రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఇవాళ్ళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు. 

రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ మా నాయకుడు రాహుల్ గాంధీని వెనకేసుకువస్తూ, నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్నట్లు మాట్లాడి మా పార్టీ నాయకులలో, కార్యకర్తలలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆయన బిజెపిని మోడీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే మోడీ, అమిత్ షాల సూచనల మేరకు ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు. 

ఇటువంటి మాయ మాటలతో మా యూపీయే భాగస్వామ్య పార్టీల మద్య చీలికలు తెచ్చి కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీయే అధికారంలోకి వచ్చేందుకు జరుగుతున్న పెద్ద కుట్ర ఇది. అందుకే కేసీఆర్‌ మా కాంగ్రెస్‌ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకె అధినేత స్టాలిన్, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే వంటివారితోనే మాట్లాడుతున్నారు. సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి నరేంద్రమోడీ, షాల దగ్గర సుపారీ తీసుకొని పనిచేస్తున్నారు. 

కేసీఆర్‌కు నిజంగా నరేంద్రమోడీని గద్దె దింపాలను కొంటే, కాంగ్రెస్‌తో కలవని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ వంటివారితో కలిసి ఫ్రంటో... టెంటో పెట్టుకొంటే మంచిది. 

తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెపుతూ సోనియా గాంధీ ఎదుట తన కుటుంబ సభ్యులపై ప్రమాణాలు చేసి తరువాత మాట తప్పిన కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ నమ్మదు. దరిజేరనీయదు. మళ్ళీ కేసీఆరే స్వయంగా వచ్చి బ్రతిమాలినా టిఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్‌ అంగీకరించదు. కనుక కేసీఆర్‌ మాట్లాడుతున్న మాటలు విని కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు అయోమయానికి గురికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 

మన లక్ష్యం రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. కేంద్రంలో బిజెపిని గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం. కనుక కేసీఆర్‌ మాటలతో అయోమయానికి గురికాకుండా టిఆర్ఎస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడుదాం. మన లక్ష్యాలను సాధించుకొందాం,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.         



Related Post