సిఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటంతో మళ్ళీ చాలా రోజుల తరువాత సర్జికల్ స్ట్రైక్స్ అంశం తెరపైకి వచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధారాలు చూపమని అడగడంలో తప్పేమిటని సిఎం కేసీఆర్ ప్రశ్నించారు. బిజెపికి ఎన్నికలకు ముందు ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు సరిహద్దులలో ఈవిదంగా హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సరిహద్దులో భారత్ ఆర్మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటే ఆ క్రెడిట్ వారికే దక్కాలి కానీ దానిని ప్రధాని మోడీ, బిజెపి వాడుకొంటుండటం చాలా దారుణమని సిఎం కేసీఆర్ విమర్శించారు.
ఈ అంశంపై గతంలో కాంగ్రెస్,బిజెపిల మద్య అలాగే బిజెపి-బిజెపీయేతర పార్టీల మద్య చాలా తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు మరోసారి మొదలయ్యాయి.
భారత్ ఆర్మీ కార్యకలాపాలను బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ఎంత తప్పో, బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఈ అంశంపై మాట్లాడుతూ రాజకీయాలు చేయడం కూడా అంతే తప్పు. దేశంలో రాజకీయ పార్టీలు మన ఆర్మీ, నేవీ, వాయుసేనలను వాటి కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతుంటే త్రివిద దళాల విశ్వసనీయత, సైనికుల మనోస్థైర్యం దెబ్బ తినడమే కాకుండా ఈ విషయంలో పాకిస్థాన్ వాదనలను మనమే దృవీకరించినట్లవుతుంది కూడా. కనుక త్రివిద దళాలను, వాటి కార్యకలాపాలను రాజకీయాలలోకి లాగకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఏ పార్టీ అయినా అటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలే వాటికి బుద్ధి చెప్పడం కూడా చాలా అవసరం. అప్పుడే వాటికి దూరంగా ఉంటాయి.