సిఎం కేసీఆర్ నిన్న జనగామ సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, ఈ ఏడాదిలోగా వారిలో 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. అంటే ఆయన దానిపై చాలా గట్టి నమ్మకం పెట్టుకొన్నారని కనుక దానిని కొనసాగించాలని నిర్ణయించుకొన్నట్లు స్పష్టం అయ్యింది.
దాంతో హుజూరాబాద్‌లో ఆశించిన ఫలితం రానప్పటికీ దానిని కొనసాగించడం ద్వారా ఆ పధకం అమలుపై సిఎం కేసీఆర్ చిత్తశుద్ధిని చాటుకొన్నట్లవుతుంది. దీనిపై ప్రతిపక్షాల వాదలను ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. ఇది వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చవచ్చు. ఏవిదంగా అంటే, ఆ ఎన్నికలలో వేరే పార్టీలకి ఓట్లు వేసి గెలిపిస్తే అవి అధికారంలోకి వచ్చాక ఈ పధకాన్ని పక్కన పడేయవచ్చు కనుక అదే టిఆర్ఎస్‌ను గెలిపించుకొన్నట్లయితే ఏదో ఓ రోజు ఈ పధకం తమకు అందుతుందనే ఆశతో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు టిఆర్ఎస్‌కే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు దానిని కాదని టిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయడం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
2023 డిసెంబర్‌కి టిఆర్ఎస్ ప్రభుత్వం పదవీకాలం ముగుస్తుంది కనుక శాసనసభ ఎన్నికలకు ఇంకా 22 నెలలు సమయం మాత్రమే మిగిలి ఉంది. కనుక ఈలోగా ప్రవేశపెట్టబోయే రెండు బడ్జెట్‌లలో ఈ పధకానికి భారీగా నిధులు కేటాయించడం ఖాయం. దాంతో దళిత ఓటర్లను ఆకట్టుకొని గంపగుత్తగా వారి ఓట్లు పొందే ప్రయత్నాలు గట్టిగా చేయడం ఖాయం. అయితే దళిత బంధుపై టిఆర్ఎస్ లెక్కలు ఫలిస్తాయో లేదో అప్పుడే తెలుస్తుంది.