ఏపీ విభజనపై రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

February 08, 2022


img

ఓ పక్క బిజెపి, కేంద్రప్రభుత్వంపై టిఆర్ఎస్‌ కత్తులు దూస్తుంటే, ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ్ళ ఏపీ రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడుతూ, “ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ స్వార్ధం కోసమే హడావుడిగా ఏపీని విభజించింది. అయినా దాని వలన రెండు తెలుగు రాష్ట్రాలలో తిరస్కారానికి గురయింది. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్ర విభజనపై పార్లమెంటులో లోతుగా చర్చించి విభజించి ఉండి ఉంటే రెండు రాష్ట్రాలకి మేలు కలిగిఐ ఉండేది. కానీ పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి, ప్రతిపక్షాల మైకులు కట్‌ చేసి, పెప్పర్ స్ప్రే చల్లి హడావుడిగా ఎటువంటి చర్చ లేకుండానే విభజన బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్‌ చేసిన ఈ తప్పిదం వలన నేటికీ రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. రెండు రాష్ట్రాల మద్య అనేక వివాదాలు నెలకొన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య నెలకొన్న ఈ వివాదాలు, వైషమ్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయమే. 

అదే... దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన ఎంతో సాఫీగా పూర్తయింది. ఆయా రాష్ట్రాల మద్య తరువాత ఎటువంటి వివాదాలు తలెత్తలేదు. కాంగ్రెస్‌ అహంకారం వలననే దేశం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోయాయి,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

టిఆర్ఎస్‌ మొదటి నుంచి కూడా రాష్ట్ర విభజనపై ఇటువంటి వాదనలను తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తెలంగాణలో టిఆర్ఎస్‌ బిజెపి, కేంద్రప్రభుత్వంపై కారాలు, మిరియాలు నూరుతుంటే, ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర విభజన సరిగా జరుగలేదంటూ మాట్లాడి టిఆర్ఎస్‌ పుండుపై కారం చల్లారనే చెప్పవచ్చు. 

ఆయన కాంగ్రెస్ పార్టీని పార్లమెంటులో ఎండగట్టేందుకే ఈ ప్రస్తావన చేసినప్పటికీ, అది టిఆర్ఎస్‌ను రెచ్చగొడుతుంది కనుక టిఆర్ఎస్‌ కూడా బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడవచ్చు. ఈవిషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదనుకోలేము. అంటే ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ప్రస్తావన చేశారనుకోవచ్చు. అంటే బిజెపి కూడా టిఆర్ఎస్‌తో కత్తులు దూయడానికి సిద్దంగా ఉందని సంకేతం ఇచ్చినట్లే భావించవచ్చు. కనుక ఇక నుంచి తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య యుద్ధం మరో స్థాయిలో జరగవచ్చు.


Related Post