మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేంద్రప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించగా, ఓవైసీ దానిని తిరస్కరించారని కేంద్రహోంమంత్రి అమిత్ షా నిన్న రాజ్యసభలో తెలిపారు. అయితే నేటికీ ఓవైసీకి ముప్పు పొంచి ఉందని కనుక జెడ్ కేటగిరీ భద్రతను అంగీకరించాలని పార్లమెంటు వేదికగా విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదని, తాను సామాన్య ఏ కేటగిరీ పౌరుడిలాగానే జీవించాలనుకొంటున్నానని అసదుద్దీన్ ఓవైసీ సమాధానం చెప్పారు.
ఈ నెల 3వ తేదీన అసదుద్దీన్ ఓవైసీ యూపీలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ తిరిగి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిని యూపీ పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఎంపీగా ఉన్న తాను యూపీలో పయనిస్తుంటే తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని, తనకు భద్రత కల్పించడంలో యూపీ ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని ఓవైసీ ఆరోపించారు. కానీ ఇప్పుడు కేంద్రప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించబోతే అంగీకరించడం లేదు! ఆనాడు గాంధీజీని చంపినవారే తనను చంపాలని ప్రయత్నించారని తాను చావుకు భయపడబోనని అంటూ ఓవైసీ ఆవేశంగా మాట్లాడారు. అంటే ఈ ఘటనను ఆయన యూపీ శాసనసభ ఎన్నికలలో రాజకీయంగా వాడుకొని సానుభూతి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
అయితే కేంద్రప్రభుత్వం భద్రత కల్పించాలనుకొంటే దానిని ఆయన నిరాకరించడం వలన భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయనపై ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఆయన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నిందించలేరు. అప్పుడు బిజెపియే ఎదురు ప్రశ్నించగలుగుతుంది.