భారత్‌లో ఎల్ఐసీ (లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అంటే ఓ నమ్మకం...ప్రజల కష్టార్జితానికి... జీవితాలకు భద్రత. అందుకే దేశంలో పేద, మద్యతరగతి ప్రజలు మొదలు కోటీశ్వరుల వరకు ఎల్ఐసీ పాలసీలు తీసుకొంటుంటారు. అందుకే చాలా ప్రభుత్వ రంగసంస్థలు నాష్టాలలో మునిగి తేలుతున్నా ఎల్ఐసీ మాత్రం లాభాల బాటలో పయనిస్తోంది. అయితే కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను ఉపసంహరించుకొని, ఒక్కో సంస్థను వరుసగా ప్రైవేట్ పరం చేస్తోంది. ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించింది. దాని తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎల్ఐసీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. త్వరలోనే ఎల్ఐసీని అమ్మేయబోతున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా మొన్న లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దీంతో ఎల్ఐసీకే భద్రత లేనప్పుడు అది ఇక ప్రజలకెలా నమ్మకం, భద్రత కల్పించగలదు? అనే సందేహం కలుగకమానదు. కనుక ముందుగా ఎల్ఐసీయే తనని తాను కాపాడుకోవడానికి ఏదైనా పాలసీ తీసుకోవాలేమో?”అసలు లాభాలలో నడుస్తున్న ఎల్ఐసీని కేంద్రప్రభుత్వం ఎందుకు అమ్మేస్తోంది?” అనే టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నకు ఇంతవరకు సమాధానమే లేదు.