మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై ఆయన సన్నిహితుడు, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నా స్నేహితుడు గులాం నబీ ఆజాద్‌కు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. దేశానికి ఆయన చేసిన సేవలను ప్రత్యర్ధి పార్టీ అయిన బిజెపి గుర్తించింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గుర్తించనేలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు ఇక అవసరం లేదని భావిస్తోందేమో?” అని అన్నారు.
గులాం నబీ ఆజాద్‌కు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీలో ఒక్క శశీ థరూర్ (ఎంపీ) తప్ప మరెవరూ స్పందించలేదు. బహుశః ఎందుకంటే, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశిస్తున్న 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలలో ఆయన కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలంటే పార్టీని, దాని విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకాలు తమ స్వార్ధం కోసం కాంగ్రెస్ పార్టీని బలిపశువుగా చేస్తున్నారని సీనియర్ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రతికించుకోవాలంటే సమూలంగా మార్పు అవసరమని లేకుంటే క్రమంగా కనుమరుగు అయిపోతుందని వారు వాదిస్తున్నారు. కానీ వారి వాదనలను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకుండా వారినే పార్టీకి శత్రువులుగా భావిస్తూ పార్టీకి దూరంగా పెట్టింది. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ గులాంనబీ ఆజాద్‌కు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డు వచ్చినా స్పందించడం లేదనుకోవలసి ఉంటుంది.