హుజూరాబాద్ ఉపఎన్నికకు సుమారు 5 నెలల ముందు నుంచే టిఆర్ఎస్ మంత్రులు, ఈటల రాజేందర్ నిత్యం నియోజకవర్గంలో గ్రామాలలో తిరుగుతూ కనిపించేవారు. అక్టోబర్ 30న ఉపఎన్నిక ముగిసేవరకు అందరూ కలిసి హుజూరాబాద్ ప్రజలను కంటి నిండా నిద్రపోనీకుండా చేశారు. కానీ టిఆర్ఎస్ ఎన్ని వరాలు ప్రకటించినా చివరికి హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్‌నే భారీ మెజార్టీతో గెలిపించారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులలో ప్రజల మద్దతుతో ఆయన భారీ మెజార్టీతో గెలవడం నిజంగా చాలా గొప్ప విషయమే.
అయితే ఉపఎన్నికలో గెలిచిన తరువాత నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన ఏమి చేశారు? ఏమి చేస్తున్నారు?అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. టిఆర్ఎస్‌ను కాదని ప్రజలు ఆయనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గం కోసం ఏమీ చేయలేదని కనుక గెలిపించినా ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఏమీ చేయరని ఆనాడు టిఆర్ఎస్ నేతలు వాదించారు. వారి వాదనలు నిజమే అని ఇప్పుడు నమ్మవలసి వస్తోంది. టిఆర్ఎస్ నేతలు చెప్పినట్లే ఈటల రాజేందర్ బిజెపి రాజకీయాలలో బిజీ అయిపోయినట్లు కనిపిస్తున్నారు.
ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే, ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని, దానికి తానే హామీ అని మంత్రి హరీష్‌రావు పదేపదే చెప్పారు. కానీ ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించినందున ఆ హామీకి తాము కట్టుబడి ఉండవలసిన అవసరంలేదని మంత్రి హరీష్‌రావు భావిస్తున్నారేమో తెలీదు కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో పడ్డాయి.
దళిత బంధు పధకాన్ని అమలుచేయకుండా బిజెపి నేతలు అడ్డుకొంటున్నారని కానీ ఏ శక్తి దానిని అడ్డుకోలేదని పదేపదే గొంతు చించుకొని చెప్పిన టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు దళిత బంధు పేరే ఎత్తడం లేదు. ఇప్పుడు ఎవరూ దానిని అడ్డుకోకపోయినా అమలుచేయడం లేదు. రాష్ట్రమంతటా దళిత బంధు పధకం అమలుచేయాలని లేకుంటే ఊరుకోమని పదేపదే హెచ్చరించిన కాంగ్రెస్, బిజెపిలు కూడా ఇప్పుడు ఆ ప్రస్తావనే చేయకపోవడం ఇంకా విశేషం.
ప్రజలు నమ్మకం పెట్టుకొన్న ఈటల రాజేందర్, ఓటమి పాలైనందుకు టిఆర్ఎస్ కూడా పట్టించుకోకపోతే హుజూరాబాద్ నియోజకవర్గం ఏవిదంగా అభివృద్ధి జరుగుతుంది?ప్రజలు తమ సమస్యలను ఎవరికి మొర పెట్టుకోవాలి?