పవన్, జగన్ మద్యలో చిరు!

January 14, 2022


img

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ జనసేన ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోఉన్నందున ఏపీ రాజకీయాలలో చురుకుగా ఉంటూ అధికార వైసీపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తుంటారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అంశాలతో సినిమాలు తీయడానికి పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ, తన సినిమా ప్రమోషన్‌లో రాజకీయ అంశాలపై మాట్లాడుతుంటారు. “ఏపీ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధించేందుకు మిగిలిన హీరోలు, నిర్మాతలను ఇబ్బందిపెట్టవద్దని, కావాలంటే తన సినిమాలను నిలిపేయాలని” పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌లో అన్నారు. 

ఏపీ ప్రభుత్వంతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయ యుద్ధం చేస్తుంటే, ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నిన్న తాడేపల్లికి వెళ్ళి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో భోజన సమావేశం కావడం విశేషం. అది ముగిసిన తరువాత చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నన్ను సోదరుడిలా చాలా ఆప్యాయంగా మాట్లాడారు. సినిమా టికెట్స్ ధరలపై నేను చెప్పినదంతా చాలా శ్రద్దగా విని సానుకూలంగా స్పందించారు,” అని చెప్పారు. 

అయితే తమ ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ తరచూ విమర్శలు చేస్తూ, బిజెపి, టిడిపిలతో అంటకాగుతుంటే, చిరంజీవి వచ్చి నచ్చజెప్పితే ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన అభిప్రాయాలను మార్చుకొంటారనుకోలేము. నిజానికి సినీ పరిశ్రమలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలామంది ప్రతిపక్షపార్టీ (టిడిపి)తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్నందునే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందనే వాదనలు వినిపిస్తున్నాయి. కనుక చిరంజీవి రాయబారం ఫలిస్తుందో లేదో చూడాలి. 


Related Post