తెలంగాణలో ముంచుకొస్తున్న మరో ప్రమాదం

January 14, 2022


img

తెలంగాణకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. యాసంగి సీజనులో వరి వేయవద్దని, వేసినా కొనుగోలుచేయబోమని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా రాష్ట్రంలో 15.61 లక్షల ఎకరాల్లో రైతులు మళ్ళీ వరి పంటే వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 5 లక్షల ఎకరాలలో వరినాట్లు పూర్తయ్యాయి. రాబోయే రెండు వారాల్లో మరో 15-20 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసే అవకాశం ఉందని అంచనా. ప్రత్యామ్నాయ పంటల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి స్పష్టత, సహాయసహకారాలు లభించకపోవడంతో ఏమి చేయాలోపాలుపోని రైతులు ఏమైతే అయ్యిందనుకొంటూ మళ్ళీ వరినాట్లు వేస్తున్నారు.   

గత ఏడాది 52 లక్షల ఏకరాలతో పోల్చి చూస్తే ఈ యాసంగిలో 50 శాతం కంటే తక్కువే వరి వేస్తున్నప్పటికీ, రైతులకు ఆ పంట ఉత్పత్తినీ అమ్ముకోవడం చాలా కష్టం. పైగా యాసంగిలో పండే ధాన్యంలో అధికశాతం బాయిల్డ్ రైస్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది కనుక రైతులకు దానిని అమ్ముకోవడం ఇంకా కష్టమవుతుంది.   

గత ఏడాది వర్షాకాలంలో పండిన బియ్యమే ఇంతవరకు పూర్తిగా అమ్ముడుపోలేదు. మరో 3-4 నెలల్లో మళ్ళీ 20 లక్షల ఎకరాల నుంచి బాయిల్డ్ రైస్ వస్తే ఏమి చేయాలి?ఎవరు కొంటారు? ఎవరూ కొనకపోతే అప్పులు చేసి పండించిన రైతుల పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే ప్రమాదం ముంచుకొస్తోందని అర్దం అవుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ సమస్య పరిష్కారానికి మార్గం కనుగొనవలసి ఉంది. లేకుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తినడానికి తిండిలేక ప్రజలు చనిపోతుంటే, రాష్ట్రంలో ధాన్యం రాసులు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి రావచ్చు. 


Related Post