భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భార్యా, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్న నాగ రామకృష్ణ చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. “ఆర్ధికంగా చాలా చితికిపోయి ఉన్న నన్ను వనమా రాఘవేందర్ చాలా వేధించాడు. నా తల్లితండ్రుల ఆస్తిలో నాకు వాటా దక్కాలంటే నా భార్యను ఒంటరిగా హైదరాబాద్‌లో తన వద్దకు పంపాలని ఆదేశించాడు. లేకుంటే చిల్లిగవ్వ కూడా దక్కనివ్వనని బెదిరించాడు. ఒకవేళ అతను డబ్బు అడిగి ఉంటే ఇచ్చేవాడిని కానీ భార్యను పంపమంటే ఎలా? ఏ భర్తా కూడా భరించలేని మాట ఇది.
జిల్లాలో వనమా రాఘవేందర్ అరాచకాలకు ఇప్పటికే చాలా మంది బలైపోయారు. ఇటీవలే పాల్వంచలో ఒక వ్యక్తి అతని వలన ఆత్మహత్య చేసుకొన్నాడు. కానీ ఇంతకాలం ఈ విషయాలు బయటకు పొక్కలేదు. డబ్బు, పరపతి ఉందనే అహంకారంతో విర్రవీగుతూ నావంటి సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వనమా రాఘవేందర్ చేతిలో మరింతమంది బలవకుండా అతనిని కటినంగా శిక్షించాలని కోరుతున్నాను.
ఈ వేధింపులు తాళలేక నేను ఒక్కడినే చనిపోతే ఆ తరువాత అతను నా భార్యాపిల్లలను విడిచిపెట్టడనే భయంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది...” అంటూ సెల్ఫీ వీడియోలో కన్నీళ్ళు పెట్టుకొంటూ తాను అనుభవించిన మానసిక క్షోభను, వనమా రాఘవేందర్ ఆగడాలు, వేధింపుల గురించి వివరించి భార్యాపిల్లలకు నిప్పుపెట్టి తను కూడా అంటించుకొని సజీవదహనం అయ్యాడు.
తెలంగాణ ఈటీవీలో ప్రసారమైన ఈ సెల్ఫీ వీడియో చూస్తే అతను ఎంత వేదన అనుభవించాడో అర్దమవుతుంది.