తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు ఓ శుభవార్త! నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకు మందేసి చిందేసేందుకు వీలుగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి 12 గంటల వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ తెరిచి ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి ఒంటి గంటవరకు వేడుకలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులు దీని కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో ఎక్సైజ్ శాఖ నుంచి తాత్కాలిక లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది. ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్ కోసం రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఓ పక్క బహిరంగ సభలు, సమావేశాలపై జనవరి 2వరకు నిషేదం అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, మళ్ళీ 31నా అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచడానికి, వేలమందితో ఈవెంట్ నిర్వహణకు ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. అర్దరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచి, ఈవెంట్స్ నిర్వహణ కోసం రూ.2.5 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నప్పుడు జనాలు ఇష్టం వచ్చినట్లు తాగి తందానాలు ఆడవచ్చని ప్రభుత్వమే వారికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుంది కదా? మరి మాస్కులు ధరించి, భౌతికదూరం, కరోనా ఆంక్షలు పాటించాలనే ఉత్తర్వులను జారీ చేయడం ఎందుకు? హైకోర్టు మాట కాదనలేకనే అనుకోవాలేమో?