భారత్‌లో మళ్ళీ అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ

December 27, 2021


img

కేంద్రప్రభుత్వం ఏటా వివిద అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ప్రతిబింబించే గణాంకాలు, ర్యాంకులు, అవార్డులు ప్రకటిస్తుంటుంది. తాజాగా కేంద్ర పరిపాలనా సంస్కరణలు, పబ్లిక్ గ్రీవెన్స్ శాఖ 2021 సం.నికిగాను సుపరిపాలన (గుడ్ గవర్నెస్)కు సంబందించి గణాంకాలు ప్రకటించగా వాటిలో రెండు అంశాలలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరో రెండు అంశాలలో రెండో స్థానంలో నిలిచింది.     

రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, మౌలికవసతుల కల్పన, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం, పర్యావరణం తదితర పది అంశాలను తీసుకొని ‘సుపరిపాలన’ ర్యాంకులు ప్రకటించగా వాటిలో తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా 0.699 పాయింట్లు, తరువాత వరుసగా గుజరాత్‌ 0.662, కర్ణాటక 0.660, హర్యానా 0.657, పంజాబ్వ 0.628 పాయింట్లు సాధించినట్లు ప్రకటించింది.

ఎకనామిక్ గవర్నెస్‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఆర్ధిక క్రమశిక్షణ, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ అనుబంద రంగాల ద్వారా గ్రామీణ ఉపాధి కల్పన, పేదలకు ఇళ్ళ నిర్మాణం, ఆరోగ్యభీమా తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ఎకనామిక్ గవర్నెస్‌లో గుజరాత్‌కు అత్యధికంగా 0.678 పాయింట్లు రాగా ఆ తరువాత వరుసగా తెలంగాణ 0.632, కర్నాటక 0.617, మహారాష్ట్ర 0.600, తమిళనాడుకు 0.571 పాయింట్లు లభించాయి. 

మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలో గోవా అగ్రస్థానంలో నిలిచింది. గోవాకు అత్యధికంగా 0.840 పాయింట్లు, ఆ తరువాత వరుసగా తెలంగాణ 0.793, హర్యానా 0.791, పంజాబ్ 0.778, గుజరాత్‌ 0.765 పాయింట్లు సాధించాయి.   

సాంఘిక సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం 0.617 పాయింట్లు, ఆంధ్రప్రదేశ్‌ 0.546, కేరళ 0.542, తమిళనాడు 0.540, గోవాకు 0.523 పాయింట్లు లభించాయి. 

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఈ ర్యాంకింగులే సమాధానంగా నిలుస్తాయి. రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిల మద్య రాజకీయాలు ఏవిదంగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో దూసుకుపోతోందని స్పష్టం అవుతోంది.


Related Post