హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యంగా టిఆర్ఎస్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు కనబడుతోంది. ధాన్యం కొనుగోలు, బొగ్గు గనుల వేలం వ్యవహారంలో కేంద్రప్రభుత్వం, బిజెపిలపై టిఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం వైఖరికి నీరసంగా టిఆర్ఎస్ ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయబోతోంది. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొనబోతున్నారు. ఈ ధర్నాలలో కేంద్రప్రభుత్వాన్ని, బిజెపిని గట్టిగా ఎండగట్టాలని సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ విజయంతో చాలా ఉత్సాహంగా ఉన్న బిజెపి కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వాన్ని, తమను రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తుండటంతో, రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఎన్నికల హామీలపై టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు సిద్దం అవుతున్నారు.
త్వరలోనే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ హెచ్చరించారు. సిఎం కేసీఆర్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు అమలు తదితర హామీలను ప్రభుత్వం అమలుచేసేవరకు బిజెపి పోరాటం కొనసాగిస్తుందని కే.లక్ష్మణ్ అన్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలే ప్రజాసమస్యలను పరిష్కరించవలసి ఉంది. కానీ అవే పోటాపోటీగా ధర్నాలు చేస్తుండటంతో ఇక ప్రజలు తమ గోడు ఎవరికి మొర పెట్టుకోవాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... వాటి నడుపుతున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు... వీటిలో ప్రజలకు ఎవరు జవాబుదారీ వహించాలి?