టిఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ (డిఎస్) మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో డిఎస్ ఇంటికి వెళ్ళి కాంగ్రెస్‌లోకి తిరిగిరావలసిందిగా ఆహ్వానించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. నిన్న ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. కనుక నేడో రేపో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమే.
డిఎస్‌కు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం, పదవులు లభించినప్పటికీ ఆయన టిఆర్ఎస్‌లోకి వెళ్లారు. సిఎం కేసీఆర్ కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. కానీ టిఆర్ఎస్‌లో కూడా ఆయన ఇమడలేకపోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బిజెపిలో చేరడం, లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసి ఆమెను ఓడించడంతో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి డిఎస్‌కు మద్య దూరం పెరిగింది. అప్పటి నుంచి ఆయన టిఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు.
ఇప్పుడు ఆయన కాంగ్రెస్ గూటికి తిరిగివస్తున్నప్పటికీ మళ్ళీ ఆయనకు, ఆయన వలన కాంగ్రెస్ పార్టీకి కూడా అవే ఇబ్బందులు తప్పకపోవచ్చు. జిల్లాలో ఓ వైపు టిఆర్ఎస్‌ను, మరోపక్క బిజెపిని ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది. టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కాంగ్రెస్ కోసం తన కుమారుడు ధర్మపురి అర్వింద్ రాజకీయ జీవితాన్ని దెబ్బ తీయలేరు. అదీగాక 73 ఏళ్ళ వయసులో డిఎస్ రాజకీయాలలో చురుకుగా పాల్గొనలేకపోవచ్చు. కనుక ఆయన చేరిక వలన కాంగ్రెస్ పార్టీ కొత్త సమస్యలను ఆహ్వానించుకొన్నట్లు అవుతుందే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు.