సమ్మెతో సింగరేణి కూడా మునగబోతోందా?

November 27, 2021


img

సింగరేణికి చెందాల్సిన కొన్ని బొగ్గు గనులను కేంద్రం వేలం వేయాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్‌ అనుబంధ గుర్తింపు యూనియన్ టిఎస్‌బికెఎస్‌ డిసెంబర్‌ 9 తరువాత సమ్మె చేస్తామని సమ్మె నోటీస్ ఇచ్చింది. టిఎస్‌బికెఎస్‌ అధికార టిఆర్ఎస్‌ పార్టీకి అనుబంద సంస్థ కనుక టిఆర్ఎస్‌ ప్రభుత్వం... పార్టీ వైఖరికి అనుగుణంగా నడుచుకోవడం సహజమే. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు అంశంతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం ప్రకటించడమే కాక ఇంకా ఇతర అంశాలపై యుద్ధం కొనసాగిస్తామని చెపుతోంది. కనుక వాటిలో భాగంగానే ఈ సమ్మెను చూడాల్సి ఉంటుంది. 

బొగ్గు గనులు వేలం విషయంలో టిఎస్‌బికెఎస్‌ వాదన సహేతుకంగా ఉన్నప్పటికీ సమ్మె చేస్తే కేంద్రం వెనక్కు తగ్గుతుందనుకోవడం అత్యాశే. ఒకవేళ కేంద్రం దిగివచ్చే వరకు సమ్మె చేస్తామంటే చివరికి నష్టపోయేది సింగరేణి సంస్థ... దానిలో పనిచేస్తున్న కార్మికులే. 

ఇక సింగరేణికి వేరే సమస్యలు కూడా ఉన్నాయి.  రాష్ట్ర విద్యుత్ సంస్థలు సింగరేణికి బారీగా బకాయిలున్నాయి. వాటిని చెల్లించకపోవడంతో సింగరేణికి నష్టం వస్తోంది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి సింగరేణికి లాభాలు తగ్గిపోయాయి. వాటిలో నియోజకవర్గం అభివృద్ధి పేరిట ప్రభుత్వం కొంత తీసుకొంటోంది. కనుక ఈ పరిస్థితులలో టిఆర్ఎస్‌ వైఖరికి కట్టుబడి టిఎస్‌బికెఎస్‌ సమ్మె చేస్తే సింగరేణి ఇంకా నష్టపోతుంది. సింగరేణి నష్టపోతే ముందుగా ఆ ప్రభావం పడేది కార్మికుల మీదే అని మరిచిపోకూడదు. టీఎస్‌ఆర్టీసీ సమ్మెతో ఏమి జరిగిందో అందరూ చూశారు. కనుక టిఎస్‌బికెఎస్‌రాజకీయాలకు అతీతంగా సింగరేణి సంస్థ...కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది.


Related Post