తెలుగు సినీ పరిశ్రమకు జగనన్న షాక్

November 25, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న కానుక’ పేరుతో రాష్ట్రంలో వివిద వర్గాలకు అనేక సంక్షేమ పధకాలు పంచిపెడుతున్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమకు జగనన్న ఇచ్చిన తాజా కానుక మాత్రం ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. నిన్న ఏపీ శాసనసభ సమావేశంలో సినీ నియంత్రణ చట్ట సవరణను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ప్రకారం ఇకపై రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసుకోవాలి. దీనిపై ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సినిమా టికెట్స్ ధరలను కూడా ప్రభుత్వం సవరించడమే సినీ పరిశ్రమకు పెద్ద షాక్. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్నిటికీ ఇకపై కేవలం రూ.30,50,70,100 మాత్రమే టికెట్స్ వసూలు చేయాలని చట్టంలో పేర్కొన్నారు. స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు అంటూ ప్రత్యేక షోలు వేసుకొని ఇష్టం వచ్చినంతా టికెట్ వసూలు చేయడానికి వీలులేదని చట్టంలో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం సూచించిన సంస్థ ఆన్‌లైన్‌లో సినిమా టికెట్స్ అమ్ముతుంది. 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలన్నీ కనీసం రూ.100-150 కోట్ల భారీ బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నారు. మరి ఈ టికెట్ ధరలతో లాభాల మాట దేవుడెరుగు కనీసం సినిమాకు పెట్టిన పెట్టుబడి సైతం వెనక్కు రావడం కష్టం. కనుక ఏపీ ప్రభుత్వం చేసిన ఈ తాజా చట్టంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖ్యంగా వందల కోట్లు పెట్టుబడితో సినిమాలు నిర్మిస్తున్న పెద్ద నిర్మాతల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇంతకాలం ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ పెద్దలు సామరస్యంగా చర్చలు జరుపుతూ తమ కష్టానష్టాలను నివేదించుకొంటున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుండటంతో సినీ పరిశ్రమ నిశ్చింతగా ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం వారందరికీ తేరుకోలేని పెద్ద షాక్ ఇచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి టికెట్స్ ధర విషయంపై పునరాలోచన చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే మూడు రాజధానుల చట్టం వెనక్కు తీసుకొన్నందుకు ఏపీ ప్రభుత్వం నవ్వులపాలవుతోంది. కనుక ఇప్పుడు ఈ సినీ నియంత్రణ చట్టాన్ని వెనక్కు తీసుకోకపోవచ్చు. మరి అప్పుడు తెలుగు సినీ పెద్దలు ఏమి చేస్తారో? 


Related Post