పంజాబ్ రైతులకు మూడు లక్షలు...దేనికో?

November 23, 2021


img

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ శివార్లలో ఏడాదిగా ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులలో వివిద ఆరోగ్య సమస్యలతో సుమారు 700-750 మంది చనిపోయారని సిఎం కేసీఆర్‌ చెప్పారు. వారందరికీ నివాళులు అర్పించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందజేస్తామని సిఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. ఓ పక్క రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న రైతులు విలపిస్తుంటే, సిఎం కేసీఆర్‌ పంజాబ్ రైతులకు ఆర్ధికసాయం ప్రకటించడంతో సహజంగానే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సిఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని గట్టిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, మున్సిపల్ కాంట్రాక్ కార్మికులను పట్టించుకోకుండా పంజాబ్ రైతులకు సిఎం కేసీఆర్‌ ఆర్ధిక సాయం  ప్రకటించడం ‘అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుంది…’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో దళిత బంధు పధకం గురించి గట్టిగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, ఇప్పుడు పంజాబ్ రైతులకు ఆర్ధికసాయం అందజేస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పడం చాలా నమ్మశక్యంగా లేదని, దీని వెనుక ఏదో పెద్ద ఆలోచనే ఉందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. 

ఢిల్లీలో రైతులు ఆందోళన మొదలైన తరువాత సిఎం కేసీఆర్‌ రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు కానీ ఎన్నడూ వారిని కలిసి వారి పోరాటానికి సంఘీభావం తెలపలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌ నిర్వహించినప్పుడు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ దానిలో పాల్గొన్నారు. ఆ తరువాత కూడా సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళివచ్చారు కానీ ఆందోళన చేస్తున్న రైతులను కలవలేదు. కానీ ఇప్పుడు హటాత్తుగా వారికి సంఘీభావం తెలుపడమే కాక మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందజేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందుకే ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. 

అయితే సిఎం కేసీఆర్‌ హటాత్తుగా పంజాబ్ రైతులతో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకొంటున్నారు? అని ఆలోచిస్తే ‘బహుశః జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకే...అనే ఓ సమాధానం కనబడుతుంది . ఇది అవునా..కాదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.


Related Post