ఏపీ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకు ఓ కనువిప్పు

November 20, 2021


img

అధికార పార్టీలు నైతిక విలువలు పాటించకపోతే ఏమవుతుందో తెలియాలంటే ఏపీ రాజకీయాలను, తాజా పరిణామాలను చూస్తే అర్ధం అవుతుంది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను వెంటపడి వేధించింది. ఆ వేధింపులు భరించలేక జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరవకుండా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసుకొంటూ పార్టీని బలపరుచుకొని అధికారంలోకి వచ్చారు. 

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తప్పు చేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబునాయుడు, నారా లోకేష్, టిడిపి ముఖ్యనేతలపై రాజకీయ ప్రతీకారం తీర్చుకొంటోంది. ఆనాడు శాసనసభలో టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిదంగా జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన కుటుంభ సభ్యులను, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించారో ఇప్పుడు అంతకంతకు అంత అన్నట్లుగా నిన్న శాసనసభలో చంద్రబాబునాయుడుని అవమానించారు. దాంతో ఆయన కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అదంతా డ్రామా... మున్సిపల్ ఎన్నికలలో టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ప్రజల దృష్టిని మళ్ళించచడానికే కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ ఆనాడు టిడిపి చేసినదానికి వైసీపీ వడ్డీతో సహా తీర్చుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రం నిజం. 

‘జైసా కర్నీ...వైసా భర్నీ...’ అని హిందీలో ఓ సామెత ఉంది. అంటే మనం ఏవిదంగా వ్యవహరిస్తే ఆవిదంగానే ఫలితం అనుభవించాల్సి వస్తుందని దానర్ధం. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురేలేదని...ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే భ్రమతో అధికార పార్టీలు ప్రజాస్వామ్య విధానాలను మరిచి, నైతిక విలువలను పక్కను పెట్టి ప్రతిపక్షాలతో ఆడుకొంటే ఇలాగే జరుగుతుందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. 

నిజానికి ఏపీ కంటే చాలా ముందే తమిళనాడును పాలించిన డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలు కూడా ఈవిదంగానే వ్యవహరించి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాయి. ఏపీలో టిడిపి, వైసీపీలు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అలాగే వ్యవహరిస్తున్నాయి. కనుక భవిష్యత్‌లో వైసీపీ నేతలకు మళ్ళీ ఇంతకు ఇంత అనుభవించవలసి రావచ్చు. ఏపీలోని ఈ తాజా పరిణామాలు అన్ని రాష్ట్రాలలో అధికార పార్టీలకు కనువిప్పు కలిగించాలని ఆశిద్దాం.


Related Post