కేసీఆర్‌ అన్నీ తనకే తెలుసనుకొంటారు: ఈటల

November 19, 2021


img

సిఎం కేసీఆర్‌ నిన్న ధర్నా చేయడంపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్‌ బిజెపి కారాల్యంలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ కేంద్రంతో యుద్ధం చేయడం కాదు... హుజూరాబాద్‌తోనే ఆయన పతనం ప్రారంభం అయ్యింది. అన్నీ తనకు మాత్రమే తెలుసని, తాను మాత్రమే ఏదైనా చేయగలననే అహంకారంతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. ఆ ధోరణితోనే రాష్ట్రంలో వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేశారు. ఓసారి సన్నబియ్యం వేయమంటారు. మరోసారి వద్దంటారు. పత్తి వేయమంటారు. ఆ తరువాత దానిని పట్టించుకోరు.  రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో ధాన్యం రంగుమారి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి. రైతులు ఆవేదన పట్టించుకోకుండా కేంద్రాన్ని నిందిస్తూ ధర్నాలు చేస్తున్నారు.  

గత ఏడేళ్ళుగా రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుచేస్తున్నట్లు, దేశంలో మరే రాష్ట్రం ఇంత కొనుగోలుచేయడం లేదంటూ సిఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు ఈ ధర్నాతో కేంద్రప్రభుత్వమే ఇంతకాలం రాష్ట్రంలో పండే ధాన్యం కొనుగోలు చేస్తోందని ఆయనే స్వయంగా చాటి చెప్పుకొన్నారు. కేంద్రప్రభుత్వం ధాన్యం కొనడంతో పాటు గోనె సంచులకు, రైస్ మిల్లర్లకు కూడా డబ్బు చెల్లిస్తోంది. బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు కనుకనే దానిని వేయవద్దన్ని కేంద్రప్రభుత్వం చెపితే అసలు ధాన్యమే కొనదని సిఎం కేసీఆర్‌ ప్రజలకు అబద్దాలు చెపుతున్నారు. బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేనందున మున్ముందు కేంద్రప్రభుత్వం దానిని తీసుకోవడం తగ్గిస్తుందని రైస్ మిల్లర్లు ఏనాడో కేసీఆర్‌కు చెప్పారు. కానీ అన్నీ నాకే తెలుసనుకొనే కేసీఆర్‌ వారి మాటలను పట్టించుకోలేదు. అందుకే నేడు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు వేలకోట్లు ఖర్చు పెట్టారు కదా?రాష్ట్రంలో వరి రైతుల కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? రేయింబవళ్లు శ్రమించి పండించి చేతికి వచ్చిన ధాన్యం కొనేనాధుడు లేక రైతులు కన్నీళ్ళు పెట్టుకొంటుంటే వారిని ఆదుకోవలసిన కేసీఆర్‌ ధర్నాలు చేస్తూ కేంద్రాన్ని నిందిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభించాలి,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.


Related Post