థాంక్స్ టు ఓటీటీ

November 17, 2021


img

కరోనాతో తెలుగు సినీ పరిశ్రమకు తీరని నష్టం కలిగినప్పటికీ దాని పుణ్యామని ఓటిటీలు ఆవిర్భవించాయి. నిజానికి ఓటీటీలు అంతకు ముందే ప్రవేశించినప్పటికీ లాక్‌డౌన్‌ సమయంలోనే వాటికి ఆదరణ, డిమాండ్ పెరిగాయి. వాటితో ప్రేక్షకులకు ఇంట్లో కూర్చోనే కొత్త సినిమాలు రిలీజ్ అయిన మొదటిరోజు మొదటిషో చూసేయగలుగుతున్నారు. పైగా థియేటర్లకు వెళితే అయ్యే అదనపు ఖర్చు కూడా ఓటీటీలలోఉండదు. ముఖ్యంగా చిన్న సినీ నిర్మాతలకు, నూతన దర్శకులు, నటీనటులకు ఓటీటీలు గొప్ప వరంగా మారాయి. గతంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరికేవి కావు. కొత్త దర్శకులకు, కొత్త నటీనటులకు అవకాశాలు లభించేవి కావు. కానీ ఇప్పుడు ఆహా, అమెజాన్, నెట్‌వర్క్‌ ఫ్లిక్స్, జీ5, డిస్నీహాట్ స్టార్ వంటి అనేక ఓటీటీలు ఆ కొరతను, వారి సమస్యలను  తీర్చుతున్నాయి. 

ఓటీటీలో రిలీజ్ అయిన అనేక చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో పెద్ద హీరోలు సైతం తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్దపడుతున్నారు. సూర్య నటించిన జైభీమ్, గోపీచంద్ నటించిన ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

అలాగే ఓటీటీలలో చిన్న సినిమాలతో తమ సత్తా చాటుకొన్న నూతన దర్శకులు, నటీనటులు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు, దర్శకుల నుంచి ఆఫర్లు అందుకొంటున్నారు.  

ఇక ఓటీటీలలో వెబ్‌ సిరీస్ రూపంలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు తదితరులకు మరో గొప్ప అవకాశం అందుబాటులోకి తీసుకువచ్చింది. సంవత్సరాల కొద్దీ సాగే తెలుగు సీరియల్స్ చూసి చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు మంచి కంటెంట్‌తో మంచి కిక్కిచ్చే వెబ్‌ సిరీస్ అందుబాటులోకి రావడంతో వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే వాటిలో కొన్ని ‘అతి’ ఉండటం వేరే విషయం కానీ వెబ్‌ సిరీస్ మాత్రం దేశంలో ఓ కొత్త ట్రెండ్, సరికొత్త వినోదం అందజేస్తున్నాయని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు పెద్ద నిర్మాతలు, కార్పొరేట్ కంపెనీలు సైతం సొంతంగా ఓటీటీలు ఏర్పాటు చేసుకొని, వాటికి తగ్గ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ తయారుచేస్తున్నారు. కనుక భవిష్యత్‌లో ఓటీటీలకు మరింత ఆదరణ, డిమాండ్ పెరగడం తధ్యం. కనుక అందరూ థాంక్స్ టు ఓటీటీ అనుకోవలసిందే. 


Related Post