కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈటల ఊసేత్తలేదు..ఎందుకో?

November 15, 2021


img

ఇటీవల సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్‌లు పెట్టి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని, బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని కడిగిపడేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓటమికి, తద్వారా ఆయన ఆహాన్ని దెబ్బతీసిన ఈటల రాజేందర్‌ ఊసే ఎత్తలేదు! 

దీనిని ఆంద్రజ్యోతి మీడియా ఓ ఆసక్తికరమైన కోణంలో నుంచి చూసింది. సిఎం కేసీఆర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే ఈటల రాజేందర్‌ను పక్కన పెట్టి బండి సంజయ్‌ను టార్గెట్ చేసుకొన్నారని అభిప్రాయపడింది. ఎందుకంటే, హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడించడం ద్వారా సిఎం కేసీఆర్‌నే ఓడించినట్లయింది. దీంతో ఈటల రాష్ట్ర రాజకీయాలలో హీరోగా అవతరించినట్లయింది. కనుకనే ఆయనకు ఇంకా ప్రాధాన్యం కల్పించకూడదనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ బండిని టార్గెట్ చేశారు. ఇంకా చెప్పాలంటే బిజెపిలో ఈటల ప్రాధాన్యత తగ్గించి బండి సంజయ్‌ని హైలైట్ చేయడానికే సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈటల ఊసే ఎత్తలేదు. ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఈటలను టార్గెట్ చేసుకొని విమర్శించి ఉంటే ఆయన చాలా బలమైన రాజకీయ నాయకుడని సిఎం కేసీఆర్‌ స్వయంగా దృవీకరించినట్లవుతుంది. అందుకే సిఎం కేసీఆర్‌ రంగంలో దిగి ఆయనను ఎదుర్కోవలసివస్తోందనే అభిప్రాయం ప్రజలలో కలుగుతుంది. అది ఇష్టం లేకనే సిఎం కేసీఆర్‌ కేవలం బండి సంజయ్‌పై మాత్రమే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని ఆంధ్రజ్యోతి అభిప్రాయం వ్యక్తం చేసింది. 

అయితే సిఎం కేసీఆర్‌ పట్టించుకోనప్పటికీ ఈటల రాజేందర్‌ ఆయనను విడిచిపెట్టరని వేరే చెప్పక్కరలేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఆయన ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. టిఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ 5 నెలల్లో ఎదుర్కొన్న ఆయనకు అనేక చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. కనుక ఆయన తప్పకుండా సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని నిత్యం విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్‌ నేతల ద్వారానైనా సిఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ను ఎదుర్కోకతప్పదు.


Related Post