పాడి కౌశిక్‌ రెడ్డి పరిస్థితి ఏమిటో?

November 10, 2021


img

కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌ రెడ్డి పరిస్థితి నేటికీ అయోమయంగానే ఉంది. టిఆర్ఎస్‌లో చేరగానే సిఎం కేసీఆర్‌ ఆయనకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ సిఫార్సు చేసినప్పటికీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేటికీ దానిని ఆమోదించకుండా పక్కనపెట్టారు. దీంతో చాలా సులువుగా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనుకొన్న పాడి కౌశిక్‌ రెడ్డికి నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక సిఎం కేసీఆర్‌ ఆయనకు వాటిలో అవకాశం కల్పిస్తారో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

స్థానిక సంస్థల కోటాలో టిఆర్ఎస్‌కు మొత్తం 14 మంది ఎమ్మెల్సీలు ఉండగా వారిలో 12 మంది పదవీ కాలం 2022, జనవరి 4వ తేదీతో ముగుస్తుంది. ఆ స్థానాలకే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కనుక వారందరూ మళ్ళీ మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ వారిలో కొందరిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తే పాడి కౌశిక్‌ రెడ్డి పేరు ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది.

పదవీ విరమణ చేయబోతున్న ఎమ్మెల్సీలు: 

కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), కాశిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకూళ్ళ దామోదర్ రెడ్డి (మహబూబ్‌నగర్‌), పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు (రంగారెడ్డి), టి.నారదాసు లక్షణరావు, టి.భానుప్రసాద్ రావు (కరీంనగర్‌), తేరా చిన్నప రెడ్డి (నల్గొండ), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్‌), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), వి భూపాల్ రెడ్డి (మెదక్‌), పురాణం సతీష్(ఆదిలాబాద్). 


Related Post