సిఎం కేసీఆర్‌ బండి సంజయ్‌ని విమర్శించి మేలే చేశారా?

November 09, 2021


img

హుజూరాబాద్‌లో ఈటల చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి సిఎం కేసీఆర్‌ ఆహాన్ని దెబ్బతీసినందునే ఆయన ఇంత అసహనం ప్రదర్శిస్తున్నారని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బండి సంజయ్‌ తన స్థాయికి తగ్గవాడు కాదంటూనే ఎన్నడూ లేనివిదంగా మళ్ళీ ఆయనపై విరుచుకుపడటం గమనిస్తే సిఎం కేసీఆర్‌ తీవ్ర అసహనంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. బండి సంజయ్‌పై సిఎం కేసీఆర్‌ ఆగ్రహానికి ఆయన విమర్శలు, ఆరోపణలు ఒక కారణమైతే, హుజూరాబాద్‌ ఓటమి మరో కారణంగా కనిపిస్తోంది. 

అయితే సిఎం కేసీఆర్‌ ఏ ఉద్దేశ్యంతో బండి సంజయ్‌పై విరుచుకుపడినప్పటికీ, ఇది రాష్ట్ర బిజెపి నేతలు కోరుకొంటున్నట్లే టిఆర్ఎస్‌కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమని సిఎం కేసీఆర్‌ స్వయంగా దృవీకరించినట్లయింది. అంతేకాదు...సిఎం కేసీఆర్‌ స్వయంగా విరుచుకుపడటంతో బండి సంజయ్‌ పాపులారిటీ మరింత పెరుగుతుంది. అలాగే రాష్ట్ర బిజెపి నేతలకు కావలసినన్ని అస్త్రశస్త్రాలను సిఎం కేసీఆర్‌ స్వయంగా అందించినట్లయింది కూడా. సిఎం కేసీఆర్‌ ఎదురుదాడిని బిజెపి నేతలు అందిపుచ్చుకొని రాష్ట్రంలో మరింత అల్లుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు సిఎం కేసీఆర్‌ వెర్సస్ ఈటల రాజేందర్‌ అన్నట్లుండేది కానీ సిఎం కేసీఆర్‌ ఇప్పుడు దానిని తాను వర్సస్ బండి సంజయ్‌గా మార్చారు. అందుకు బండి సంజయ్‌ సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోకతప్పదు.


Related Post