దళిత బంధును ప్రజలు నమ్మలేదా?

November 02, 2021


img

టిఆర్ఎస్‌ కాదన్నప్పటికీ హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం దళిత బంధు పధకాన్ని హడావుడిగా ప్రకటించి అమలుచేసిందని అందరికీ తెలుసు. సిఎం కేసీఆర్‌ స్వయంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పధకాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్‌లో దీని అమలు కోసం కేవలం రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వం రూ.2,000 కోట్లు విడుదల చేసింది. ఈ ఉపఎన్నికలో దళిత బంధు పధకం గేమ్ ఛేంజర్‌గా టిఆర్ఎస్‌ భావించింది. టిఆర్ఎస్‌కు సవాళ్ళు విసురుతున్న ఈటల రాజేందర్‌, బిజెపి, కాంగ్రెస్‌ నేతలు ఈ దళిత బంధు పధకంతో తుడిచిపెట్టుకుపోతారని టిఆర్ఎస్‌ భావించింది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌యే ఘన విజయం సాధించబోతోందని పలు సర్వేలలో తేలిందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ ఉపఎన్నికల టిఆర్ఎస్‌ ఇన్‌ఛార్జ్ మంత్రి హరీష్‌రావు కూడా టిఆర్ఎస్‌ గెలుపు ఖాయమని బల్లగుద్ది వాదించారు. 

అయితే ఇప్పటివరకు 12 రౌండ్ల ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దళిత బంధు పధకం ప్రకటించినా ఎందుకు ఇలా జరుగుతోంది? హుజూరాబాద్‌ ప్రజలు ఈ పధకాన్ని ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని నమ్మడంలేదా? అనే సందేహం కలుగుతోంది. లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం ఆ సొమ్మును జమా చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం దానిని ఫ్రీజ్ చేయడం, ఉపఎన్నిక పూర్తయిన తరువాత ప్రభుత్వం దానిని మళ్ళీ వెనక్కు తీసేసుకొంటుందనే ప్రతిపక్షాల ప్రచారం వలన ఓటర్లలో టిఆర్ఎస్‌ చిత్తశుద్ధి పట్ల అనుమానాలు, అపోహలు ఏర్పడి ఉండవచ్చు. బహుశః అందుకే దళిత బంధు పధకం హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బ్యాక్ ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. టిఆర్ఎస్‌ తన రాజకీయ లబ్ది కోసం ఒక వర్గం ప్రజల కోసం ఈ పధకం ప్రవేశపెట్టి ఆ భారం మిగిలినవారిపై మోపుతుండటం కూడా ప్రజాగ్రహానికి ఓ కారణం అయ్యుండవచ్చు. 

అయితే హుజూరాబాద్‌లో ఇంకా మరో 11 రౌండ్స్ ఓట్ల లెక్కింపు చేయవలసి ఉంది. వాటిలోనైనా టిఆర్ఎస్‌ పుంజుకొని విజయం సాధించినట్లయితే దళిత బంధు టిఆర్ఎస్‌ పార్టీని ఒడ్డున పడేసినట్లే భావించవచ్చు లేకుంటే బ్యాక్ ఫైర్ అయినట్లే! అదే కనుక జరిగితే టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఈ పధకాన్ని ఉపఎన్నిక తరువాత అమలుచేస్తుందా లేదా అటకెక్కించేస్తుందో చూడాలి. 


Related Post