విజయ గర్జన సభ వాయిదా...ఎందుకో?

November 02, 2021


img

ఈనెల 15వ తేదీన వరంగల్‌లో టిఆర్ఎస్‌ విజయ గర్జన సభ నిర్వహించాలనుకొంది కానీ దానిని నవంబర్‌ 29కి వాయిదా వేసుకొంది. తెలంగాణ సాధన కోసం 2009, నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు కనుక ఈనెల అదే రోజున విజయ గర్జన సభ పెట్టుకొంటే దీక్షా దివస్‌ను గుర్తుచేసుకొన్నట్లు ఉంటుందనే టిఆర్ఎస్‌ నేతల సూచనల మేరకు విజయ గర్జన సభను వాయిదా వేసినట్లు టిఆర్ఎస్‌ ప్రకటించింది. 

అయితే టిఆర్ఎస్‌కు దీక్షా దివస్ ఇంత ప్రాధాన్యమైనప్పుడు మొదటే ఈ తేదీని ఖరారు చేసి ఉండవచ్చు. కానీ హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు వెలువడుతున్న ఈ సమయంలో ఈ వంకతో సభను వాయిదా వేయడం విశేషం. ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే ‘విజయ గర్జన’ చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక సభ పేరును మార్చుకోవడమో లేదా వాయిదా వేసుకోవడమో చేయవలసి ఉంటుందని మై.తెలంగాణ.కామ్ ముందే ఊహించి చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతోంది. అంటే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలుపుపై నమ్మకం తగ్గినట్లనిపిస్తుంది. ఈ ఉపఎన్నికలో గెలిచినా ఓడినా టిఆర్ఎస్‌కు ‘ఫరక్’ పడదని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పదేపదే చెప్పడం కూడా అదే సూచిస్తోంది.  

కానీ ఇప్పుడు ఈ సభకు నవంబర్‌ 29ని ఖరారు చేయడం చాలా తెలివైన నిర్ణయమే అని చెప్పవచ్చు. ఏవిదంగా అంటే ఈ సభలో ఆనాటి కేసీఆర్‌ ఆమరణ దీక్షను హైలైట్ చేయబోతున్నారు కనుక ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడినా సభ నిర్వహణకు ఇబ్బందికరం కాబోదు. ఒకవేళ గెలిస్తే అప్పుడు సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలందరూ ఈ సభలో సింహల్లా గర్జించవచ్చు. మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమె రుణం తీర్చుకోవాలని వాదిస్తున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేయడం వలననే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈ సభలో టిఆర్ఎస్‌ మరోసారి గట్టిగా నొక్కి చెప్పుకోగలదు. కనుక ఈ సభకు నవంబర్‌ 29ని ఖరారు చేయడం అన్నివిదాల చాలా తెలివైన నిర్ణయమే అని చెప్పవచ్చు. అయితే ముందే ఈ తేదీని ఖరారు చేసి ఉంటే ఇప్పుడు టిఆర్ఎస్‌కు ఇటువంటి ఇబ్బంది ఉండేది కాదు.


Related Post