హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ ఎదురీత విడ్డూరం

November 01, 2021


img

సుమారు 4-5 నెలలుగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో ఎవరు గెలువబోతున్నారో రేపు తెలియబోతోంది. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఒంటరి పోరాటం చేశారనే చెప్పవచ్చు. ఎందుకంటే హుజూరాబాద్‌లో బిజెపి ప్రభావం పెద్దగా లేదు. ఈటల అంగబలం, అర్ధబలం, ఆయనకున్న గుర్తింపు, ప్రజాధారణ ఆధారంగానే టిఆర్ఎస్‌ను ఎదుర్కొన్నారు. ఆయన వెనుక బిజెపి ఉండటం కలిసి వచ్చే అంశమే తప్ప బిజెపి జెండాను చూసి జనం ఓట్లు వేస్తారనుకోవడానికి లేదు.

ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఈటలను ఎదుర్కోవడానికి మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో యావత్ గులాబీ సేనను దింపి చమటోడ్చవలసి వచ్చిందంటే ఈటల ఎంత గట్టి పోటీ ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి దళిత బంధు పధకంతో ఈటలతో సహా అందరూ తుడిచిపెట్టుకుపోతారని భావిస్తే ఈటల దానినే అస్త్రంగా చేసుకొని టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడం విశేషం!

ఈ ఉపఎన్నిక కోసం టిఆర్ఎస్‌ దళిత బంధుతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు వంటి అనేక వరాలు గుప్పించింది. నియోజకవర్గానికి చెందిన పలువురికి హడావుడిగా పదవులు కట్టబెట్టింది. నియోజకవర్గంలో చిరకాలంగా పెండింగులో ఉన్న అభివృద్ధి పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పూనుకొని హడావుడిగా చేయించారు. కనుక టిఆర్ఎస్‌ చాలా భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశించడం సహజం. కానీ ఈ ఉపఎన్నికలో చాలా స్వల్ప శాతం తేడాతో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌, ఈటల రాజేందర్‌ల గెలుపోటములు ఉండబోతున్నాయని సర్వేలు చెప్పడం విశేషం. అదే నిజమైతే ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఓడినా గెలిచినట్లే లెక్క. ఇన్ని పధకాలు, ఇన్ని వరాలు, ఇంత భీకర యుద్ధం చేసిన తరువాత కూడా టిఆర్ఎస్‌ భారీ మెజార్టీ సాధించలేకపోతే గెలిచినా ఓడినట్లే భావించవచ్చు. ఈ హుజూరాబాద్‌ కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరు గెలిచారో మరో 24 గంటలలో తేలిపోతుంది. 


Related Post