ఏపీలో మున్సిపల్ ఎన్నికలు... టిడిపికి మరో అగ్నిపరీక్ష?

November 01, 2021


img

హుజూరాబాద్‌తో కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గానికి కూడా మొన్న 30వ తేదీన ఉపఎన్నిక జరిగింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బిజెపిలు అధికార టిఆర్ఎస్‌ను బలంగా ఢీకొన్నాయి. కానీ బద్వేల్ ఉపఎన్నికలో టిడిపి పోటీ చేయకుండా ముందే అస్త్రసన్యాసం చేసింది. బిజెపి బరిలో దిగింది కానీ వైసీపీ ధాటిని తట్టుకోలేకపోయింది. కనుక వైసీపీ గెలుస్తుందా లేదా అని కాక ఎంత మెజార్టీతో గెలుస్తుందని పందేలు సాగుతున్నాయి. చంద్రబాబునాయుడు నేతృత్వంలో టిడిపి ఏపీని 5 ఏళ్ళు తిరుగులేకుండా పాలించింది. కానీ అధికారం కోల్పోయిన రెండున్నరేళ్లలోనే ఉపఎన్నికలో పోటీ చేయలేని దుస్థికి చేరుకోవడం విశేషం.

ఇటువంటి పరిస్థితులలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. కరోనా కారణంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌, 12 మున్సిపాలిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అవి ఇప్పుడు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరించి, 14,15,16 తేదీలలో వరుసగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించబోతోంది. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికలు ఈనెల 15న జరుగుతాయి. నవంబర్‌ 17న మున్సిపల్, 18న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.                   

ఏపీలో అధికార వైసీపీని ఎదుర్కోవడానికి టిడిపి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ నిలువరించలేకపోతోంది. కనుక ఈ మున్సిపల్ ఎన్నికలు టిడిపికి మరో అగ్నిపరీక్షగా మారనున్నాయి. వీటిలో కూడా వైసీపీయే పైచేయి సాధించే అవకాశం ఉంది. 


Related Post