ఆరు ఎమ్మెల్సీ సీట్లు టిఆర్ఎస్‌కే...ఎవరికి దక్కుతాయో?

November 01, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 29న ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రస్తుతం శాసనసభలో టిఆర్ఎస్‌ పార్టీకి 104 మంది, మజ్లీస్‌కు 7 మంది, కాంగ్రెస్‌కు 6 మంది, బిజెపికి ఇద్దరూ ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్షాలకు శాసనసభలో బలం లేకపోవడంతో ఒక్క సీటుకు కూడా పోటీ చేయలేనిస్థితిలో ఉన్నాయి. కనుక ఆరు సీట్లు టిఆర్ఎస్‌కు దక్కడం లాంఛనప్రాయమే. 

ఇంతకాలం ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, ఫరీదుదీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు మళ్ళీ ఆ సీట్లు ఆశిస్తుండటం సహజం. ఇటీవల టిఆర్ఎస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు సిఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్న దేశపతి శ్రీనివాస్, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడైనప్పటికీ ఇంత వరకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయకపోవడంతో రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయిన పాడి కౌశిక్ రెడ్డి, టిఆర్ఎస్‌ సీనియర్ నేత రమేష్ రెడ్డి, క్యామ మల్లేష్ తదితరులు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. కనుక సిఎం కేసీఆర్‌ వీరిలో ఎవరెవరికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారో చూడాలి. 


Related Post