హుజూరాబాద్‌లో ఎన్నికల అధికారులు ఉన్నారో లేరో?

October 30, 2021


img

 హుజూరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి కరోనా నిబందనల కారణంగా మూడు రోజుల ముందే ఎన్నికల ప్రచారం ముగింపజేసింది ఎన్నికల సంఘం. గత నాలుగైదు నెలల నుంచి మొన్నటివరకు ఎన్నికల ప్రచారంతో హోరెత్తించిన టిఆర్ఎస్‌, బిజెపిల నేతలు ఈ మూడు రోజులుగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఒక్కో ఓటరుకు రూ.5-6,000 చొప్పున పంచిపెట్టారని ఓటర్లే చెపుతున్నారు. నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఆ డబ్బు అందని మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. 'కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఏమిటని' ఆగ్రహంగా నిలదీశారు. ఈ వార్త ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది కూడా. 

అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, నియోజకవర్గంలో ఎన్నికల అధికారులకి ఇవేమీ కనబడనట్లు పట్టించుకోలేదు. ‘పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం,’ ‘అందరూ తప్పక మాస్కులు ధరించవలెను’ అంటూ హెచ్చరించి చేతులు దులుపుకొన్నట్లుగానే ఎన్నికల అధికారులు కూడా “ఓటర్లను ప్రలోభపెట్టరాదు... ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం చట్టరీత్యా నేరం...ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాము...” అని చిలక పలుకులు పలికి చేతులు దులుపుకొన్నట్లు కనబడుతోంది. లేకుంటే నియోజకవర్గంలో ఓటర్లు తమకు డబ్బు అందలేదని రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు వెంటనే సదరు పార్టీ నేతలపై చర్యలు తీసుకొని ఉండేది. 

ఇదివరకు ఓసారి చెన్నైలో ఉపఎన్నిక జరిగినప్పుడు అధికార, ప్రతిపక్షాలు ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించగానే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ తరువాత నిర్వహించింది. కానీ హుజూరాబాద్‌లో ఓటర్లకు డబ్బు పంచుతున్నారని ఓటర్లే స్వయంగా రోడ్లపైకి వచ్చి చెపుతున్నా ఎన్నికల అధికారులకు వినిపించలేదు..కనిపించలేదు!

నియోజకవర్గంలో ఇంత డబ్బు, మద్యం పంచిన తరువాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగిందని ని ఏవిదంగా అనుకోగలము?ఒకవేళ ఓటర్లకు డబ్బు చెల్లించి ఓట్లు కొనుక్కోవడం తప్పు కాదనుకొంటే ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికి?


Related Post