వరిసాగును అడ్డుకోవడమే పరిష్కారమా?

October 30, 2021


img

వచ్చే యాసంగిలో బియ్యం, ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. కాదని వరి పండిస్తే రైతులే నష్టపోతారని హెచ్చరించింది. అంతేకాదు..జిల్లా కలెక్టర్లు, అధికారులు వరి విత్తనాలను అమ్మవద్దని, అమ్మితే దుకాణాలు మూయించి వేస్తామని వ్యాపారులను ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కనుక త్వరలో ఇది రాజకీయయుద్ధంగా మారడం ఖాయం. అయితే ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయం, ప్రతిపక్షాల విమర్శలతో వరి రైతుల సమస్యలు తీరుతాయా?అంటే కాదనే చెప్పవచ్చు. 

రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టులో ప్రధానంగా వరి సాగవుతోంది. రైతులు కూడా దానికే అలవాటుపడ్డారు కనుక దానికే మొగ్గు చూపుతున్నారు. రైతులకు వరి విత్తనాలు అందకుండా జేస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నట్లున్నారు. ఒకవేళ వరి విత్తనం ఓపెన్ మార్కెట్లో లభించకపోతే బ్లాక్ మార్కెట్‌లో  కొనే ప్రయత్నం చేయవచ్చు. అప్పుడు రైతులు నష్టపోతారు. వరి పండిస్తే ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ముందే చెపుతున్నాయి కనుక పంట చేతికి వచ్చిన తరువాత కూడా రైతులు మరింత నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

 పోనీ ప్రత్యామ్నాయ పంటలు వేద్దామంటే వాటితోనూ అనేక సమస్యలున్నాయి. ఇది వరకు ప్రభుత్వం సూచన మేరకు సన్నబియ్యం వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనుక వారు తమకు అనుభవం ఉన్న వరి పంటను కాదని ప్రభుత్వం సూచిస్తున్నట్లు ప్రత్యామ్నాయ పంటలు వేసి రిస్క్ తీసుకోకపోవచ్చు. ఇవన్నీ రైతులు ఎదుర్కొనే సమస్య కాగా ప్రభుత్వం మరో రకం సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 

ఒకవేళ రైతులు వరి పండించకుండా అడ్డుకొంటే ప్రభుత్వం పట్ల వారిలో వ్యతిరేకత ఏర్పడుతుంది. అలాగని వరి పండించుకోనిస్తే, దానిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదు కనుక రైతులు నష్టపోతారు. అప్పుడూ వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులను మళ్ళించగలిగినా, వాటి అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా సమస్యే...ఇవ్వకపోయినా సమస్యే. కనుక ప్రతిపక్షాలు ఈ సమస్యను తమకు అనుకూలంగా మలుచుకొని, రైతులను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయకమానవు. కనుక వరి పందించడాన్ని అడ్డుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం అవుతోంది. కనుక ప్రభుత్వమే ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.


Related Post