హుజూరాబాద్‌ కంచుకోట ఎవరిదో?

October 30, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక సాధారణ ఉపఎన్నికే అయినప్పటికీ, సిఎం కేసీఆర్‌తో చిరకాలం కలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఆయనకే గట్టి సవాలు విసురుతున్నందున ఇది వారిరువురికీ ప్రతిష్టాత్మకంగా మారింది. 

ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడిస్తే సిఎం కేసీఆర్‌ను ఓడించినట్లేనని ఈటల రాజేందర్‌ గట్టిగా వాదిస్తున్నారు. ఈ ఉపఎన్నిక వచ్చే శాసనసభ ఎన్నికలకు సెమీ ఫైనల్ వంటిదని బిజెపి నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌ను ఓడించగలిగితే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రజాధారణ కోల్పోతోందని, రాష్ట్రంలో బిజెపి మాత్రమే టిఆర్ఎస్‌ను ఢీకొని ఓడించగలదనే బిజెపి నేతల వాదనలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ ఉపఎన్నికలో గెలుపోటములకు సిఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ బాధ్యులవుతారు. 

అందుకే టిఆర్ఎస్‌ కూడా సర్వశక్తులు ఒడ్డి భారీ మెజార్టీ సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించడం ద్వారా సిఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న ఆయనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడమే కాక హుజూరాబాద్‌ కంచుకోటను ఈటల రాజేందర్‌ చేతిలో నుంచి తిరిగి వశపరుచుకోగలుగుతుంది. అంతేకాదు...బిజెపివి తాటాకు చప్పుళ్ళేనని టిఆర్ఎస్‌ నిరూపించగలుగుతుంది. 

ఈ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని టిఆర్ఎస్‌ చెప్పుకొంటుంటే, ఈ ఉపఎన్నికలో తానే తప్పక గెలవబోతున్నానని ఈటల రాజేందర్‌ బల్లగుద్ది మరీ చెపుతున్నారు. 

ఈ ఉపఎన్నిక రెండు పార్టీలకు ఇంత ప్రతిష్టాత్మకంగా మారినందునే యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలు కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. నేడు పోలింగ్ జరుగుతుంది. నవంబర్‌ 2న ఓట్ల లెక్కించి ఆదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. కనుక అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.


Related Post